Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీపీఐ ఎన్నికల గుర్తుగా 'కంకి కొడవలి' కొనసాగుతున్నదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీకి రాష్ట్ర స్థాయి గుర్తింపును కొనసాగిస్తున్నట్టుగా పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిందని పేర్కొన్నారు. దేశంలో కేరళ, మణిపూర్, తమిళనాడు రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా గుర్తింపును కొనసాగిస్తున్నట్టుగా ఆ నోటిఫికేషన్ద్వారా తెలిపారని గుర్తుచేశారు. 2018 ఎన్నికల గుర్తులకు సంబంధించిన నియమనిబంధనల ప్రకారంగా రాష్ట్రంలో పార్టీకి ఉన్నటువంటి నిర్మాణం, ఇతర అంశాలను పరిగణనలోనికి తీసుకుని రాష్ట్రస్థాయి గుర్తింపును కొనసాగిస్తున్నట్టుగా, స్థానిక సంస్థలతోపాటు, రాష్ట్రంలో పార్టీ ప్రాతిపదికగా జరిగే అన్ని ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ గుర్తు అయినటువంటి ''కంకికొడవలి'' యధాతథంగా కొనసాగిస్తున్నట్టుగా ఆ నోటిఫికేషన్ వెల్లడించిందని పేర్కొన్నారు. జాతీయ స్థాయి హోదాను కూడా త్వరలోనే తిరిగి పొందగలిగే అవశాకాశాలు ఉన్న నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీ అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు, ఓటర్లు మరింత విశ్వాసంతో పార్టీని పురోగమనం వైపు తీసుకెళ్లాలని కూనంనేని ఈ సందర్భంగా కోరారు.