Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
దేశ ప్రజల సేవానిరతి గొప్పది అని ప్రధాని మోడీ అన్నారు. ఇతరుల్లో ఉన్న మంచి లక్షణాలను ఆరాధించడమే 'మన్ కీ బాత్' ఉద్దేశమని చెప్పారు. 2014 అక్టోబరు 3న ప్రారంభమైన నెలవారీ కార్యక్రమం ఈ ఆదివారంతో వందవ ఎపిసోడ్ పూర్తి చేసుకున్న సందర్భంగా తనకు ప్రజల నుంచి వేలాది ఉత్తరాలు, లక్షలాది సందేశాలు వచ్చాయన్నారు. సాధ్యమైనన్ని ఉత్తరాలను చదివి, సందేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించానని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఈ ఉత్తరాలను చదివేటపుడు ఎంతో భావోద్వేగానికి గురయ్యానని అన్నారు. 'మన్ కీ బాత్' కోట్లాది భారతీయుల మనసులో మాట, వారి మనోభావాల వ్యక్తీకరణ అని అన్నారు. మునుపటి ఎపిసోడ్లలో తాను ప్రస్తావించిన అంశాలతో ప్రభావితమైన వ్యక్తులతో ఆయన నేరుగా సంభాషించారు. ఈ సందర్భంగా విశాఖపట్నానికి చెందిన వెంకటేశ్ ప్రసాద్‌ను ప్రధాని గుర్తు చేసుకున్నారు. ప్రసాద్ దేశీయ వస్తువులను మాత్రమే వినియోగించేలా చార్ట్‌ను రూపొందించి, స్వదేశీ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. గత కాలపు స్మృతులకు, భావోద్వేగాలకు, సూక్తి ముక్తావళికి ఈ వందవ ఎపిసోడ్‌ను వేదికగా ఆయన మార్చారు. మనం అమృత కాలంలో ఉన్నామని, ఈ ఏడాది జీ-20 సదస్సుకు అధ్యక్షత వహిస్తున్నామని చెప్పారు. స్వదేశీ ఆట బొమ్మల పరిశ్రమ ల పునరుద్ధరణ వంటి ఉద్యమాలు వేగం పుంజుకోవడానికి ఈ కార్యక్రమం దోహదపడిందన్నారు. స్వదేశీ జాతి కుక్కల పట్ల చైతన్యానికి ఈ కార్యక్రమం నాంది పలికిందన్నారు. ఇంటింటా జాతీయ జెండా కార్యక్రమం ప్రారంభమై నపుడు కూడా మన్ కీ బాత్ గొప్ప పాత్ర పోషించిందని గుర్తు చేశారు.