Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొత్త సచివాలయంలో ఫైలుపై సంతకం చేసిన హౌం మంత్రి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
నూతనంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయ ప్రారంభోత్సవం రోజునే తన ఛాంబర్లో కొత్త పోలీసు స్టేషన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగల్ ఇస్తూ రాష్ట్ర హౌం మంత్రి మహమూద్ అలీ ఫైల్‌పై సంతకం చేశారు. అంతకముందు ఆయన మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నూతన సచివాలయంలోని మూడో అంతస్థులోని తన ఛాంబర్లో ఆసీనులయ్యారు. ఈ కొత్త ఛాంబర్ నుంచి తొలిరోజునే 40 కొత్త పోలీసు స్టేషన్లు, రెండు డీసీపీ పోస్టుల ఏర్పాటుకు సంబంధించిన ఫైలుపై మంత్రి సంతకం చేశారు. హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనరేట్‌తో పాటు రాచకకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లలో ఈ 40 కొత్త పోలీసు స్టేషన్ల ఏర్పాటు జరుగుతున్నది. అలాగే, హైదరాబాద్ నగరంలోనే సౌత్‌వెస్ట్, సౌత్ఈస్ట్ ల పేరిట రెండు కొత్త డీసీపీ జోన్ల ఏర్పాటు జరుగుతున్నది. ఈ సందర్భంగా హౌం మంత్రి కొత్త సచివాలయంలో తన నూతన ఛాంబర్లోకి ప్రవేశిస్తున్న సమయంలో రాష్ట్ర హౌం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జితేందర్, డీజీపీ అంజనీ కుమార్, ఏసీబీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రవి గుప్తా, నగర పోలీసు కమిషనర్ సి.వి ఆనంద్, రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ సంజరు కుమార్ జైన్, రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లు డి.ఎస్. చౌహాన్, స్టీఫెన్ రవీంద్ర, టీఎస్ఎస్పీ బెటాలియన్స్ అదనపు డీజీ స్వాతి లక్రా, రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ షికా గోయెల్, తదితర ఉన్నతాధికారులు హాజరై హౌం మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, రాష్ట్ర హౌంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జితేందర్ నూతన సచివాలయంలో తన ఛాంబర్లోకి ప్రవేశిస్తున్న సందర్భంగా డీజీపీతో పాటు ఇతర పోలీసున్నతాధికారులు కూడా హాజరయ్యారు.