Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటర్ బోర్డు నిర్లక్ష్యానికి పరాకాష్ట
- కార్పొరేట్ విద్యా సంస్థలు, అకాడమీల ఫీజు దోపిడీ : ఎస్ఎఫ్ఐ డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
విద్యా సంవత్సరం మధ్యలో చదువు మానేసే ఇంటర్ విద్యార్ధులకు ఫీజు వాపసు ఇవ్వాలంటూ ఇంటర్‌బోర్డు విడుదల చేసిన మార్గదర్శకాల్లో అస్పష్టత నెలకొందని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) పేర్కొంది. కార్పొరేట్ కళాశాల్లో చదువుల కోసం విద్యార్ధులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్న వాటిపై చర్చ లేదనీ, రెసిడెన్షియల్ పద్దతిలో అపార్టుమెంట్లలో నడిపిస్తున్న కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకుంటామనే ప్రస్తావనే వాటిలో లేదని తెలిపింది. ఈమేరకు ఆదివారం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎస్ మూర్తి, టి నాగరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. జాతీయ ర్యాంకుల పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురి చేయడం, కోచింగ్ పేరుతో లక్షల రూపాయల వసూలు చేయడంపై మార్గదర్శకాల్లో అసలు పేర్కొనలేదని విమర్శించారు. ఫీజు వాపసు ఇవ్వని కళాశాలలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వివరించ లేదని తెలిపారు. పరోక్షంగా వారికే మద్దతు ఇచ్చినట్టుగా ప్రభుత్వ మార్గదర్శకాలున్నాయని పేర్కొంది.