Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక మంత్రి హరీశ్‌రావు
- డైమండ్ జూబ్లీ ఉత్సవాల పైలాన్‌కు శంకుస్థాపన
నవతెలంగాణ -హైదరాబాద్
మాసాబ్‌ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీ నుంచే నా రాజకీయ జీవితం ప్రారంభమైందని రాష్ట్ర ఆర్థిక , ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నాయకుడు కేసీఆర్ ప్రోత్సాహాంతో ఈ కాలేజీలో చదువుకునేవాడినని చెప్పారు. ఆదివారం మాసబ్ ట్యాంక్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో డైమండ్ జూబ్లీ స్మారక స్థూపం (పైలాన్) నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలేజీ భవనం పున:నిర్మాణం కోసం కృషిచేస్తానని అన్నారు. సీఎం కేసీఆర్ సైతం గతంలో పాలిటెక్నిక్ కాలేజీ కొత్త భవనానికి సమకూర్చడానికి అంగీకరించారని చెప్పారు. ఈ కాలేజీ కోసం ఇప్పటికే రూ. 2 కోట్లు మంజూరు చేశామని అన్నారు. పూర్తిస్థాయిలో మరోసారి అంచనాలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 12, 13 తేదీల్లో డైమండ్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వేగంగా కాలేజీ పున:నిర్మాణ పనులు సాగాలని కోరారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాలిటెక్నిక్ కాలేజీ కోసం పూర్వ విద్యార్థులంతా సహకరించాలని కోరారు. మంత్రి హరీశ్‌రావు గారి సహకారం గొప్పదని అన్నారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మొదటి అడుగుగా పైలాన్ ఏర్పాటుకు భూమి పూజ చేసు కోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జీపీటీ మా అధ్యక్షులు సురేశ్ ఆనంద్ మోహన్, ప్రధాన కార్యదర్శి లల్లూ నాయక్, ఐఆర్ఎస్ అధికారి మురళీమనోహర్, బండి రమేశ్, పూర్వ విద్యార్థి, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య తదితరులు పాల్గొన్నారు.