Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజేతలకు ట్రోఫీలు అందజేత
నవతెలంగాణ-ఓయూ
మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఉత్సాహంగా సాగిన 24వ జాతీయ విద్యా చలనచిత్ర ఉత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. కన్సార్షియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో ఆయా విభాగాల్లో విజేతలైన డాక్యుమెంటరీ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, సాంకేతిక నిపుణులకు ట్రోఫీలను అందజేశారు. ఈ ముగింపు కార్యక్రమనికి ముఖ్య అథితిగా ఓయూ రిజిస్ట్రార్ ప్రొ.పప్పుల లక్ష్మీనారాయణ, గౌరవ అతిథిగా యూజీసీ వ్యవహారాల డీన్ ప్రొ.జి.మల్లేశం హాజరయ్యారు. సీఈసీ డైరెక్టర్ ప్రొ.జేబీ.నడ్డా మూడు రోజుల పాటు ఇక్కడే ఉండి డాక్యుమెంటరీ చిత్రోత్సవాన్ని తిలకించారు.ఈ సందర్భంగా రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఓయూలో తొలిసారి ఇలాంటి కార్యక్రమం జరిగినా విజయవంతం చేసినందుకు నిర్వాహకులను అభినందించారు. భవిష్యత్తులోనూ విద్యాసంబంధ కార్యక్రమాలు ఓయూకు కేటాయించాలని సీఈసీ డైరెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. దృశ్య మాధ్యమానికి సమాజంలోని అన్ని అడ్డంకులను చేధించే సత్తా ఉందని, ఇంట్లో అమ్మ చేసే పని మీదా డాక్యుమెంటరీలు రావాలని యువ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, విద్యార్థులకు పిలుపునిచ్చారు.