Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18న రాష్ట్ర సదస్సు
- మే 22 నుంచి 31 వరకు ఇందిరాపార్క్ వద్ద రిలే దీక్షలు
- పట్టణ ప్రాంతాలకు ఉపాధి పనిని విస్తరించాలి: గ్రామీణ ఉపాధి హామీ పరిరక్షణ కమిటీ పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పేదలకు దూరం చేస్తున్నదనీ, ఇలాంటి విధానాలను వెనక్కి తీసుకోవాలని గ్రామీణ ఉపాధి హామీ పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. పట్టణ ప్రాంతాలకు ఉపాధిని విస్తరించాలని కోరింది. దశల వారీ ఆందోళన పోరాటాలను నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఈనెల 18న రాష్ట్ర సదస్సు నిర్వహించాలనీ, మే 22 నుంచి 31 వరకు ఇందిరాపార్కు వద్ద రిలేదీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఈమేరకు ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం(వ్యకాస) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు పి. శంకర్, కార్యదర్శి పులి కల్పన, పీపుల్స్ మానిటర్ రింగ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ పి. శివలింగం, దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. నరసింహ తదితరులు సమావేశమై, పలు నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామీణ ఉపాధి సమస్యలపై చర్చించారు. అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి చట్టాన్ని గొంతు నులిపి చంపాలని చూస్తున్నదని విమర్శించారు. అందులో భాగంగానే నిధులను భారీగా తగ్గించారనీ, ఉపాధి జాబ్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్ లింకు పేరుతో కూలీల సంఖ్యను కుదించేందుకు సీరియస్ ప్రయత్నం చేస్తున్నదని చెప్పారు. ఉదయం ఏడు గంటలకు, సాయంత్రం ఐదు గంటలకు పని ప్రదేశంలో కూలీలు ఫోటోలు దిగి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తేనే వేతనాలు ఇవ్వాలని సర్కులర్ను జారీ చేయడం సరైందికాదని పేర్కొన్నారు.