Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యలు పరిష్కరించుకుందాం..
- రజక వృత్తిదారుల సంఘం మహాసభలో పైళ్ళ ఆశయ్య
నవతెలంగాణ-జనగామ
ఐక్యంగా పోరాటాలు నిర్వహించి రజకుల సమస్యలు పరిష్కరించు కుందామని రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ళ ఆశయ్య పిలుపు నిచ్చారు. జనగామ జిల్లా కేంద్రంలోని వైష్ణవి గార్డెన్స్‌లో రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్ర మహాసభలకు రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడిరాజు నరేష్, రాష్ట్ర నాయకులు ఎదునూరి మధర్, సుభద్ర, బాలకృష్ణ అధ్యక్ష వర్గంగా వహించారు. చివరి రోజైన ఆదివారం రజకుల సమస్యలపై 12 తీర్మానాలు ప్రవేశపెట్టగా, రాష్ట్ర మహాసభ ప్రతినిధులు చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా ఆశయ్య మాట్లాడుతూ.. గీత, బీడీ కార్మికులకు ఇచ్చినట్టుగానే 50 ఏండ్లు నిండిన వారికి వృద్దాప్య పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రజకులకు రక్షణ చట్టాలు కల్పించి ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. రజక వృత్తిదారులకు రూ.10 లక్షల రుణాలు అందించాలని కోరారు. ఉచితంగా విద్యుత్ అందించి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో, లాండ్రీలు, పోలీసు, రైల్వే, విమానయాన విద్యా రంగ, దోబీ పోస్టులను రజకులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే బీసీ కులగణన చేపట్టి జస్టిస్ రోహిణి కమీషన్ సిఫారస్సులు అమలు చేయాలన్నారు. పాలకుర్తిలో వీరనారి ఐలమ్మ స్మారక స్మతి వనం కోసం 6 ఎకరాల భూమి కేటాయించాలని, అలాగే ట్యాంక్ బండ్‌పై ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ప్రతి గ్రామంలో మోడ్రన్ దోభీఘాట్లు, కమ్యునిటీ భవనాలకు 2 ఎకరాలు కేటాయించాలన్నారు. రైతులకు ఈనాం భూములకు పట్టాలివ్వాలని, చాకి రేవు స్థలాలకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం రజకులు ఐక్యంగా పోరాడాలని పిలుపు నిచ్చారు. మహాసభలో సంఘం నాయకులు ఎం.వెంకటేశ్వర్లు, ఠాక్రే, ఏదునూరి మదర్, ఉల్లెంగుల వెంకటేశ్వర్లు, ఈదునూరి గట్టేశం, కొలిపాక నరసింహ తదితరులు పాల్గొన్నారు.