Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక దోపిడీ, సామాజిక వివక్షపై జమిలి పోరాటం
- హక్కులను పోరాటాల ద్వారానే కాపాడుకుందామన్న నేతలు
- ప్రత్యామ్నాయ సంస్కృతిని పెంపొందించేలా మేడే వారోత్సవాలు
- హైదరాబాద్‌లో సీఐటీయూ ఆధ్వర్యాన భారీ ర్యాలీ
- మహబూబాబాద్‌లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఎర్రదండు కవాతు
నవతెలంగాణ- మొఫసిల్ యంత్రాంగం
''ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతూనే సామాజిక అణచివేత, వివక్షతను రూపుమాపేందుకు కార్మిక వర్గం జమిలి పోరాటాలకు సిద్ధం కావాలి.. పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకునేందుకు మళ్లీ పోరాటాలు చేయాలి.. మోడీ హయాంలో సరళీకృత ఆర్థిక విధానాల అమల్లో వేగం పెరిగింది.. ప్రత్యామ్నాయ సంస్కృతిని పెంపొందించేలా మేడ వారోత్సవాలు నిర్వహించుకుందాం..'' అని సీపీఐటీయూ, సీపీఐ(ఎం), ఇతర వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జెండావిష్కరణలు జరిగాయి. పెద్దఎత్తున ర్యాలీలు జరిగాయి. గతంలో ఎన్నడూ జరగని రీతిలో కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మేడే స్ఫూర్తిని రగిలింపజేశారు. కోలాట దళాలతో ఉత్తేజపరిచారు.
సీఐటీయూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో వైఎంసీఏ చౌరస్తా నారాయణగూడ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు, ముషీరాబాద్ చౌరస్తా వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, డప్పువాయిద్యాలతో ముందుకు సాగారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. మేడే అంటే పోరాటానికి, ఐక్యతకు సంకేతం అన్నారు. కార్మికుల రక్తంతో తడిసిందే ఎర్రజెండా అన్నారు. చికాగో అమవీరుల స్థూపం, మార్క్స్ట్, లెనిన్, ఎంగిల్స్, స్టాలిన్, చేగువేరా, భగత్‌సింగ్, పుచ్చలపల్లి సుందరయ్య, మల్లు స్వరాజ్యం వంటి మహా నాయకుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతోపాటు కళాకారుల విచిత్ర వేషధారణతో ప్రదర్శనలో పాల్గొన్నారు. ర్యాలీకి ఫ్లైఓవర్లు, మెట్రో స్టేషన్ల పై నుంచి పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ వద్ద సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నర్సింహారావు జెండా ఆవిష్కరించారు.
కార్మిక వర్గం కులమతాలకతీతంగా సంఘటితం కావాలని సంగారెడ్డిలోని పీఎస్ఆర్ గార్డెన్లో బాగారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మేడే సభలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అన్నారు. పాలకవర్గాలు, పెట్టుబడిదారులు తమ ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని కులం, మతం, ప్రాంతం పేరిట చీల్చేందుకు కుట్రలు చేస్తున్నాయని చెప్పారు. ఒకనాడు అమెరికాలో రోజుకు 18 గంటల పాటు నిరంకుశంగా పని చేయించే విధానానికి వ్యతిరేకంగా చికాగో నగరంలో లక్షలాదిమంది కార్మికులు సంఘటితంగా ఉద్యమించిన ఫలితంగానే 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చిందన్నారు. అనేక హక్కులు, చట్టాలు సాధించుకోబడ్డాయన్నారు. కార్మికులు తమ రక్తం చిందించి పోరాడి సాధించిన హక్కులు, చట్టాలను నేడు పాలక వర్గాలు కాలరాస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు సంగారెడ్డి పట్టణంలో వెహికల్ ర్యాలీ నిర్వహించారు.
శ్రామిక పోరాటాలకు అండ ఎర్రజెండా
సామ్రాజ పెట్టుబడిదారీ దేశమైన అమెరికాలోని చికాగో నగరంలో 137 సంవత్సరాల క్రితం అమరులైన కార్మిక నాయకుల నెత్తుటి సాక్షిగా ఆవిర్భవించిన ఎర్రజెండా శ్రామిక పోరాటాలకు అండగా ఉంటుందని, భూపోరాటాలు కమ్యూనిస్టులు హక్కు అని ప్రజాకంటక పాలన సాగిస్తున్న బీజేపీ మోడీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య హెచ్చరించారు. మేడే సందర్భంగా మహబూబాబాద్‌లోని నర్సంపేట బైపాస్ నుంచి ఆఫీసర్స్ క్లబ్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం పట్టణ కార్యదర్శి బానోత్ సీతారామ అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో వారు మాట్లాడారు.
బీజేపీ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్లకు, కార్పొరేట్లకు, బహుళ జాతి సంస్థలకు దేశ సంపదకు కట్టబెట్టే కుట్రలు చేస్తున్నారన్నారు. చరిత్రలో రాజులకు ఏ గతి పట్టిందో మోడీ, అమిత్‌షాలకు అదే గది పడుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పులు సరిదిద్దుకోవాలని సూచించారు. తక్షణమే పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పోడు పట్టాల హక్కులు ఇవ్వాలని కోరారు.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణ కేంద్రంలో, వేములపల్లిలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి జెండాను ఆవిష్కరించారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వంపై పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్మిక హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాడాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు.
మే డే సందర్భంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయం ముందు ఎర్రజెండాను ఆవిష్కరించారు. గాంధీ పార్క్ వరకు ప్రదర్శన నిర్వహించారు.
కార్మిక హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ అన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలో నిర్వహించిన మేడే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
మేడే స్ఫూర్తితో మోడీ సర్కారు కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్వీ రమ కార్మికులకు పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయం వద్ద ఆమె జెండా ఆవిష్కరించారు.
కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి
మేడే అమరవీరుల పోరాట స్ఫూర్తితో మోడీ ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్య మాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం, మున్సిపాలిటీలో 137వ ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణ కేంద్రంలో పెద్దఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక సీఐటీయు కార్యాలయంలో నిర్వహించిన సభలో సీతారాములు మాట్లాడారు.