Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక పక్షపాతి కేసీఆర్
- కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
- 60 మందికి శ్రమశక్తి అవార్డులు ప్రదానం
నవతెలంగాణ- కల్చరల్
దేశ పబ్లిక్ సెక్టార్లు అమ్మేసి పెట్రోలు, డీజిల్, గ్యాస్ రేట్లు పెంచి అదానీ లాంటి కార్పొరేట్ శక్తులకు ప్రధాని మోడీ దోచిపెడుతున్నారని, సీఎం కేసీఆర్ మాత్రం కార్మిక పక్షపాతిగా ఉన్నారని కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో సోమవారం తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు. ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి మంత్రి మల్లారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 60 మందికి శ్రమశక్తి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అదానీ ఆస్తులు అమాంతంగా పెరిగిపోయాయని, కార్మికుల ఉసురు నరేంద్ర మోడీకి తగులుతుందని అన్నారు. గతంలో కార్మికులు బతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లేవారని, తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి మారిందని చెప్పారు. తెలంగాణలో మల్టీ నేషనల్ కంపెనీలను నిర్మించడానికి అవకాశం కల్పించి అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని, ఇతర రాష్ట్రాల కార్మికులే బతుకుదెరువు కోసం తెలంగాణకు వస్తున్నారని వివరించారు. కార్మికుల పనితనంతోనే రాష్ట్రం అద్భుతంగా మారిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని, త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు నిర్మించేది కూడా తామేనని చెప్పుకొచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడే సత్తా కేసీఆర్‌కే ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక పక్షపాతి అని, కార్మికులందరూ ఐక్యంగా ఉండి 2024లో కేసీఆర్‌ను ప్రధానమంత్రి చేయాలని కోరారు. కరోనా సమయంలో కార్మికులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, త్వరలో కార్మికులకు మంచి రోజులు వస్తాయని చెప్పారు. భవన నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డులో రూ.18వేల కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయని, ఈ నిధులను కార్మికుల సంక్షేమానికి వినియోగిస్తామని చెప్పారు. భవన నిర్మాణ కార్మికులకు మోటారు సైకిళ్లు, కార్మికుల పిల్లలకు కేవీ స్కూళ్ల తరహాలో ప్రత్యేకంగా పాఠశాలలు, ఆస్పత్రులు, కార్మిక భవనాల నిర్మాణాల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పించిందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్, కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాణి కుముదిని, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మెన్ దేవేందర్‌రెడ్డి, కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.