Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమీక్షా సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలతో పంట నష్టంతో పాటు చెట్లు కూలి కరెంటు స్తంబాలపై పడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్నదని విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారంనాడాయన సచివాలయంలో విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సునీల్‌శర్మ, టీఎస్‌ట్రాన్స్‌కో, జెన్కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డితో రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, విద్యుత్ సరఫరా, విద్యుత్ శాఖకు జరుగుతున్న నష్టంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంబాలు, వైర్లు దెబ్బతిన్నాయనే వివరాలను అధికారులు మంత్రికి వివరించారు. ఆపరేషన్స్ అండ్ మెయిటెనెన్స్ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. ఇటీవల పంటపొలాల్లో కరెంటు తీగలు తెగిపడి మరణించిన రైతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నష్ట నివారణా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇటీవల ఆర్టిజన్ల సమ్మె, తదనంతర ఫలితాలను కూడా సమీక్షించారు. ఎలాంటి ఉద్రిక్తతలు లేకుండా సమ్మెను విరమింపచేసి, సమస్యలు పరిష్కరించినందుకు ఆయన అధికారులను అభినందించారు. తెగిపడిన విద్యుత్ తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిస్కంల పరిధిలో మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేయాలనీ, కరపత్రాలు పంచాలని చెప్పారు.