Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
రాష్ట్రంలోని ఆర్ అండ్ బీ రోడ్ల మరమ్మతుల పనుల్లో వేగం పెంచాలని ఆ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం తెలంగాణ కొత్త సెక్రటేరియట్లో ఆర్ అండ్ బీ ఉన్నతాధికారులతో నిర్వహించిన తొలి సమీక్ష చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అధిక వర్షాలతో దెబ్బతిన్న 1172 పీరియాడికల్ రెన్యువల్ రోడ్ల మరమ్మతుల పనుల కోసం సీఎం కేసీఆర్ రూ. 2858 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. ఈ రోడ్ల మరమ్మతులపై సీఎం ప్రత్యేక దష్టి సారించారని చెప్పారు. నిర్ణీత గడువులోగా ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి కావాలని సూచించారు. ఇప్పటికే 518 కోట్లతో 1393 కిలోమీటర్ల పొడవు గల రోడ్ల మరమ్మతులు పూర్తి చేశామన్నారు. రూ. 1,223 కోట్ల విలువైన 455 రోడ్ల పనులు మొత్తం 2,700 కిలోమీటర్ల మేర వచ్చే 45 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతులు పనులు 60 వర్క్ ఏజెన్సీలు పని చేస్తున్నాయని, ప్రతీ ఏజన్సీతో క్షేత్ర స్థాయిలో సమీక్షించి నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. పనులు పూర్తయితే రోడ్లు అద్దంలా తయారవుతాయని చెప్పారు. ఈ సమీక్షలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఆర్ అండ్ బీ కార్యదర్శి శ్రీనివాస రాజు ,ఈఎన్సీ రవీందర్రావు, డీసీ దివాకర్, ఎస్.ఈ వసంత్ నాయక్ ఇతర ఆర్ అండ్ బీ అధికారులు పాల్గొన్నారు.