Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వానాకాలంలో కోటి 40 లక్షల ఎకరాల్లో సాగు : సమీక్షా సమావేశంలో మంత్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రానున్న కాలంలో పత్తి, కంది సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. వానాకాలంలో కోటి 40 లక్షల ఎకరాల్లో సాగు అంచనా వేసినట్టు తెలిపారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయంపై తొలి సమీక్షా సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మరో 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించాలని కోరారు. వివిధ పంటల సాగుకు అవసరమయ్యే 18 లక్షల క్వింటాళ్ల విత్తనాలు, సేంద్రీయ సాగు, భూసారాన్ని దృష్టిలో ఉంచుకుని పచ్చిరొట్ట విత్తనాల సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. దీనికి రూ.76.66 కోట్ల నిధుల విడుదల చేయనున్నట్టు తెలిపారు. నానో యూరియా, నానో డీఎపీ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలని ఆదేశించారు. వ్యవసాయ అవసరాల్లో డ్రోన్ వినియోగంపై యువతకు అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. పామాయిల్ అంతర పంటల సాగు చేయాలని సూచించారు. డీసీసీబీల ద్వారా ఎకరానికి రూ.40వేలు వరకు పంటరుణాలు అందించాలని సూచించారు. రైతులకు ఇచ్చే సాంకేతిక సూచనలు, సమాచారాన్ని సోషల్ మీడియాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. నిరంతరం రైతులకు శిక్షణ, వ్యవసాయ సాంకేతిక సమాచారం, ప్రకటనలపై దృష్టి సారించాలన్నారు. నకిలీ విత్తన పంపిణీ దారులపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, వివిధ కార్పొరేషన్ల చైర్మెన్లు కొండబాల కోటేశ్వరరావు, మారం గంగారెడ్డి, కొండూరు రవీందర్రావు, సాయిచంద్, తిప్పన విజయసింహారెడ్డి, మచ్చా శ్రీనివాస్‌రావు, రాజావరప్రసాద్రావు, రామకృష్ణారెడ్డి, ఉద్యానశాఖ డైరెక్టర్ హన్మంతరావు, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హన్మంత్, వీసీ నీరజా ప్రభాకర్, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, రిజిస్ట్రార్ సుధీర్ కుమార్, ఎండీలు కేశవులు, యాదిరెడ్డి, సురేందర్, జితేందర్ రెడ్డి, రాములు, మురళీధర్, అరుణ, జేమ్స్ కల్వల తదితరులు ఉన్నారు.