Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు : సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తరతరాలుగా కష్టజీవి శ్రమతోనే ఈ ప్రపంచంలో సంపద సృష్టి జరుగుతున్నదనీ, మహౌన్నతమైన విశ్వమానవ సౌధానికి శ్రమజీవుల త్యాగాలే పునాదిరాళ్లని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. తమ చెమట చుక్కలను రాల్చి జీవనం సాగిస్తూ సమాజాభివృద్ధిలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక కష్టజీవికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఈ మేరకు సీఎంఓ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ ప్రభుత్వం కార్మిక కర్షక సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా అనేక పథకాలను అమలు చేస్తున్నదని కేసీఆర్ ఆ ప్రకటనలో తెలిపారు. ప్రమాదంలో కార్మికులు మరణిస్తే రూ.6 లక్షలను సంబంధిత కుటుంబాలకు ఇస్తున్నామని పేర్కొన్నారు. 2014 నుంచి 2023 వరకు ఇలా మరణించిన కార్మికులకు సంబంధించిన 4001 బాధిత కుటుంబాలకు రూ. 223 కోట్లను చెల్లించామని తెలిపారు. అంగవైకల్యానికి గురైతే రూ. 5 లక్షల చొప్పున 504 మంది కార్మికులకు రూ. 8.9 కోట్లమేర ఆర్థికసహాయం చేశామని వివరించారు. కార్మిక కుటుంబాల్లో ఇద్దరు పిల్లల పెండ్లికి ఒక్కరికి రూ. 30,000 ల చొప్పున 'వివాహ బహుమతి'ని రాష్ట్ర అందజేస్తున్నామని తెలిపారు. దాని కోసం 2014 నుంచి ఇప్పటిదాకా రూ. 130 కోట్లు చెల్లించామని పేర్కొన్నారు. మహిళా కార్మికులకు రెండు కాన్పుల వరకు కాన్పుకు రూ. 30,000 చొప్పున ప్రసూతి ప్రయోజనాలను అందిస్తున్నామని తెలిపారు. దాని కోసం 1,01,983 మంది లబ్దిదారులకు రూ. 280 కోట్లను చెల్లించామని వివరించారు. కార్మికులు ఏ కారణంతోనైనా మరణిస్తే లక్షరూపాయల మొత్తాన్ని కార్మికుల కుటుంబాలకు చెల్లిస్తున్నామనీ, ఇలా 35,796 మంది కార్మికులు చనిపోతే రూ. 288 కోట్లను ఇచ్చామని వివరించారు. మరణానంతరం నిర్వహించే అంతిమయాత్ర కార్యక్రమాల కోసం 39,797 మందికి రూ. 98 కోట్లను నేటివరకు చెల్లించామని తెలిపారు. కోవిడ్ కాలంలో రూ. 1,005 కోట్లను పలు కార్యక్రమాల కింద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని వివరించారు.