Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లోని మున్సిపాలిటీల పరిధిల్లో ఉన్న పేదల ఇండ్ల నిర్మాణం కోసం ఇబ్బందులు లేకుండా, నిబంధనల మేరకు వారి ఇంటి స్థలాలను క్రమబద్ధీకరించి, న్యాయపరమైన హక్కులను కల్పిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి నోటరీ స్థలాలను జీవో 58,59ల ప్రకారం క్రమబద్ధీకరించుకోవడానికి ఉన్న గడువును మరో నెల రోజులపాటు పొడిగిస్తున్నట్టు ఆయన సోమవారం ప్రకటించారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను ఆయన కోరారు. తక్షణమే తమ తమ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలను కలిసి తమకున్న నోటరీ తదితర ఇండ్ల స్థలాల రెగ్యులేషన్ సమస్యలను తెలుపుకోవాలని సూచించారు. అన్ని సమస్యలను క్రోడీకరించి, పరిష్కరించి, వారికి న్యాయపరమైన హక్కులతో కూడిన పట్టాలను ప్రభుత్వం అందజేస్తుందని సీఎం తెలిపారు. ఏకకాలంలో ఒకే మొత్తంలో పేదల ఇండ్ల సమస్యలు పరిష్కారం కావాలనేది ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు.
ఇందుకు సంబంధించిన ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. అదే సందర్భంలో వ్యవసాయ భూముల నోటరీ సమస్యలను కూడా పరిష్కరిస్తామని తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించి కలెక్టర్ల కాన్ఫరెన్సు కూడా నిర్వహిస్తామని స్పష్ఠం చేశారు. ఈ అంశాలన్నింటిపై సచివాలయంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని సోమవారం కలిసి విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తి మేరకు నోటరీ, 58,59 జీవోలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి సీఎం సానుకూలంగా స్పందించారు. మరో నెల రోజుల గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, నవీన్‌కుమార్, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాగంటి గోపినాథ్, దానం నాగేందర్, మాధవరం కష్ణారావు, జాజుల సురేందర్, ఆత్రం సక్కు, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శు స్మితాసభర్వాల్, ప్రియాంకవర్గీస్, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.