Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
- జూన్ చివరి వారంలో ప్రవేశ పరీక్షలు ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్/ఓయూ
రాష్ట్రంలో 2023-24 విద్యాసంవత్సరంలో వివిధ విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో పీజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీజీఈటీ) నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియతోపాటు దరఖాస్తుల స్వీకరణ ఈనెల 12వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తుల సమర్పణ గడువు వచ్చేనెల 11వ తేదీ వరకు ఉన్నది. ఆలస్య రుసుం రూ.500తో అదేనెల 18వ తేదీ వరకు, రూ.రెండు వేలతో 20వ తేదీ వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశమున్నది. జూన్ చివరివారంలో ఆన్లైన్లో ప్రవేశ పరీక్షల నిర్వహణ ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, జేఎన్టీయూ హైదరాబాద్‌తోపాటు మహిళా విశ్వవిద్యాలయాల్లో పీజీ ప్రవేశాల కోసం సీపీజీఈటీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇతర వివరాలకు www.osmania.ac.in లేదా https://cpget.tsche.ac.in లేదా www.ouadmissions.com వెబ్సైట్లను సంప్రదించాలి. ఈ కార్యక్రమంలో ఓయూ, కేయూ, ఎంజీయూ, ఎస్‌యూ, మహిళా విశ్వవిద్యాలయం వీసీలు డి రవీందర్, టి రమేష్, సిహెచ్ గోపాల్‌రెడ్డి, ఎస్ మల్లేశ్, సీపీజీఈటీ కన్వీనర్ ఐ పాండురంగారెడ్డి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.