Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొలకెత్తుతున్న మొక్కజొన్న
- చేతికొచ్చిన పంటలు పాడవుతుండటంతో రైతన్నల ఆందోళన
నవతెలంగాణ-తొర్రూర్ రూరల్
మాడు పగిలే ఎండాకాలంలో అకాల వర్షాలు రైతులను చిన్నాభిన్నం చేస్తున్నాయి. పంట నష్టాలు, ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, పిడుగులు.. ఆగని కుండపోత.. సాయంత్రం మొదలైతే చాలు దంచికొడుతోంది. దాంతో చేతికొచ్చిన పంట ఆగమవుతుండటంతో రైతన్నకు కన్నీరు తప్పడం లేదు. వరి చేనులో నీరు నిలిచి నేలపాలయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యం రాశులు తడిసి ముద్దవుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ డివిజన్ వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షాలకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల వల్ల కోతదశలో ఉన్న పంటలు పాడవుతున్నాయి. వాటిని కోయడం కూడా సమస్యగానే మారుతోంది. కోయకుండా పొలాల్లో ఉంచడం వల్ల రంగు మారుతుంది.మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలోని అమ్మాపురం, ఖానాపురం, కొమ్మనపల్లి, చింతలపల్లి, మడూరు, మాటేడు, ఫతేపురం, తదితర కొనుగోలు సెంటర్లలో ధాన్యపు రాశుల చుట్టూ నీరు నిలిచి దాన్యం తడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 13వ తేదీన అధికారికంగా ధాన్యం కొనుగోలును ప్రారంభించింది. 15 రోజులవుతున్నా మందకొడిగా కొనుగోలు జరుగుతోంది. నెల రోజుల నుంచి వరి ధాన్యం కొనుగోలు సెంటర్లలో పోసుకొని రైతులు వర్షాలకు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యాన్ని తూకం వేసి మిల్లులకు తరలించడంలో అధికారులు విఫలమవుతున్నారు.