Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం : మంత్రి కొప్పులకు పీపీఎల్ వినతిపత్రం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేలోపు గురుకులాలకు ప్రత్యేక కార్యదర్శిని నియమించాలని ప్రొగ్రెసివ్ పేరెంట్స్ లీగ్ (పీపీఎల్) డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం పీపీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.గోపాలస్వామి, రాష్ట్ర నాయకులు గూడెం అంజయ్య సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అధికారుల పర్యవేక్షణలోపం కారణంగా గత రెండేండ్లుగా గురుకులాల్లో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఇదే విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినప్పటికీ మార్పు కనిపించడం లేదని పేర్కొన్నారు. అందువల్ల గురుకులాలకు ప్రత్యేక కార్యదర్శిని నియమించాలని కోరారు. లేదంటే విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారని హెచ్చరించారు. షేక్‌పేటలో బ్యాడ్మెంటన్ స్టేడియం నిర్మించారనీ, దానిలో ఎలాంటి క్రీడలు నిర్వహించడం లేదంటూ గతంలో చేసిన వినతికి కూడా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం గోపాలస్వామి మీడియాతో మాట్లాడుతూ, డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానంటూ మంత్రి హామీ ఇచ్చారని విమర్శించారు.