Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడబ్ల్యూజేఎఫ్ ప్రధానకార్యదర్శి బసవపున్నయ్య
- మీడియాపై కార్పొరేట్ల పెత్తనం సరికాదని వ్యాఖ్య
నవతెలంగాణ - హైదరాబాద్
మే డే స్పూర్తితో జర్నలిస్టుల హక్కుల కోసం ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ప్రధానకార్యదర్శి బి.బసవపున్నయ్య అన్నారు. మే డే సందర్భంగా సోమవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఆయన ఫెడరేషన్ జెండా ఎగురవేశారు. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి, ప్రత్యేక రక్షణ చట్టం తేవాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బసవపున్నయ్య మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టుల వృత్తి, భౌతిక ఉనికి ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మీడియాపై ఆంక్షలు విధించటం ఏమాత్రం ఆమోద యోగ్యం కాదని వ్యాఖ్యానించారు. కార్పొరేట్ల చేతుల్లోకి మెజార్టీ మీడియా సంస్థలు వెళ్లిన నేపథ్యంలో ఆ సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులు, ఉద్యోగుల హక్కుల ప్రశ్నార్థకమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను రద్దు చేసిన మోడీ ప్రభుత్వం, వారి పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ విధానాలను సహించబోమని స్పష్టం చేశారు. జర్నలిస్టులు తమ వత్తి ధర్మం నిర్వహిస్తూనే హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై కూడా పని చేయాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందని అభి ప్రాయపడ్డారు. ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి షేక్ సలీమా, ఉపాధ్యక్షులు గుడిగ రఘు మాట్లాడుతూ న్యాయపరమైన హక్కుల కోసం జర్నలిస్టులు ఐక్యంగా పోరాడాలని అన్నారు. మేడే స్పూర్తితో కార్మిక వర్గం ఐక్యత చాటా లని ఆకాంక్షించారు. హెచ్‌యూజే కార్యదర్శి బి.జగదీశ్వర్ అధ్యక్షతన జరిగిన కార్య క్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. రాజశేఖర్, రాష్ట్ర కార్య దర్శులు గండ్ర నవీన్, కె. నిరంజన్, కార్యవర్గ సభ్యులు బీవీఎన్ పద్మరాజు, ఎస్. వెంకన్నతోపాటు సీనియర్ జర్నలిస్టులు కె. లలిత, శశికళ, శోభ, కె. ప్రియకుమార్, హెచ్‌యూజే నాయకులు నర్సింహ్మ, ఎ. ప్రశాంత్, రేణయ్య, మాధవరెడ్డి పాల్గొన్నారు.