Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లౌకికరాజ్యాన్ని మత రాజ్యంగా మార్చే కుట్ర : కార్మికవర్గం సంఘటితమై బీజేపీని ఓడించాలి : సారంపల్లి మల్లారెడ్డి
- సీఐటీయూ కార్యాలయంలో అరుణపతాకాన్ని ఎగురవేసిన పి.రాజారావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ పాలనలో కార్మిక హక్కుల హననం జరుగుతున్నదని అఖిల భారత రైతు సంఘం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. లౌకిక రాజ్యాన్ని మత రాజ్యంగా మార్చే కుట్ర జరుగుతున్నదని వాపోయారు. కార్మికవర్గమంతా సంఘటితమై ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో మేడే ఉత్సవాన్ని ఆ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ అధ్యక్షతన నిర్వహించారు. ఆ సంఘం సీనియర్ నేత పి.రాజారావు అరుణపతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ..చికాగో నగరంలో కార్మికులు పోరాట ఫలితంగానే నేడు ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పనివిధానం అమలవుతున్నదని తెలిపారు. అయితే, నేడు మన పాలకులు ఆ విధానానికి తూట్లు పొడిచి 12 గంటల పనివిధానాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అదే సమయంలో సమాఖ్య విధానానికి తూట్లు పొడుస్తూ కేంద్రం అధికారాన్నంత తన గుప్పిట్లోకి తీసుకుంటున్నదన్నారు. ఈ విధానాలను తిప్పికొట్టేందుకు అన్ని ప్రజా సంఘాలు, కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కార్మికులు, రైతులు, కూలీలు, విద్యార్ధి, యువకులు ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, వృత్తి దారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎన్వి. రమణ మాట్లాడారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. జంగారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం ఉపా ధ్యక్షులు బుర్రి ప్రసాద్, సీఐటీయూ నాయకులు అర్చటి ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల కన్వీనర్ బి. పద్మ, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పి. ఆశయ్య, గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్, నాయకులు ఆంజ నేయులు, ఎ. సునీత, స్వర్ణ, వి. సువర్ణ, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.