Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు జంగయ్య, చావ రవి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యారంగంలో ఖాళీలను భర్తీ చేయకుండా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, గెస్ట్, పార్ట్ టైం పేరుతో ఉపాధ్యాయులను నియమించి అతి తక్కువ వేతనాలు ఇచ్చి పూర్తి స్థాయిలో పనిచేయించుకుంటూ ప్రభుత్వమే శ్రమదోపిడీకి పాల్పడుతుందని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి విమర్శించారు. మేడే స్పూర్తితో శ్రమదోపిడీకి వ్యతిరేకంగా దాని అంతం కోసం ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ సంఘం సీనియర్ నాయకుడు డి మస్తాన్‌రావు అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జంగయ్య అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో చావ రవి మాట్లాడుతూ పాలకులు కార్మికుల సంక్షేమాన్ని విస్మరించారని విమర్శించారు. ఎనిమిది గంటల పనిగంటల విధానాన్ని పెంచి 12 గంటలకు పెంచారని చెప్పారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన వేతనాలు ఇవ్వకుండా శ్రమదోపిడీకి పాల్పడుతున్నారని అన్నారు. ఉపాధ్యాయులు కూడా శ్రామిక వర్గ ఆలోచనను అలవర్చుకోవాలని కోరారు. విద్యారంగంలో శ్రమదోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పత్రిక ప్రధాన సంపాదకులు పి మాణిక్‌రెడ్డి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు ఈ గాలయ్య, సింహాచలం, నాయకులు శారద, వెంకటప్ప, గోపాల్ నాయక్, రాజారావు, శ్యామ్ సుందర్, జయసింహారెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.