Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదరికం, నిరుద్యోగం, అసమానతలపై నిరంతరం పోరాటం
- సామాజిక న్యాయం కోసం ఐక్య ఉద్యమాలు: సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్
- ఎంహెచ్‌భవన్‌లో ఘనంగా మే డే ఉత్సవాలు
- ఎర్రజెండాను ఆవిష్కరించిన సీనియర్ ఉద్యోగి శేఖర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
'కార్మికులు తమ హక్కుల సాధనతోపాటు పేదరికం, నిరుద్యోగం, అసమానతలు, మహిళలపై లైంగికదాడులకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు నిర్వహించాలి. సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహించాలి. ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు తమ హక్కుల కోసం, 8గంటల పని విధానాన్ని సాధించడానికి జరిగిన చికాగో పోరాటాన్ని దెబ్బతీసేందుకు మానువాదులు కుట్ర చేస్తున్నారు. కులం, మతం పేరుతో కార్మికుల మధ్య చిచ్చుపెట్టడానికి విశ్వకర్మ జయంతిని తెరపైకి తీసుకొచ్చారు' అని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్ అన్నారు. హైదరాబాద్‌లోని నవతెలంగాణ ప్రధాన కార్యాలయం (ఎంహెచ్భవన్)లో సోమవారం నిర్వహించిన మే డే ఉత్సవాల్లో సీనియర్ ఉద్యోగి శేఖర్ ఎర్రజెండాను ఆవిష్కరించారు. అనంతరం నవతెలంగాణ ఎడిటర్ ఆర్.సుధాభాస్కర్ అధ్యక్షతన నిర్వహించిన సభలో వెంకటేష్ మాట్లాడుతూ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాలు పనిగంటల విషయంలో యాజమాన్యాలకు అనుకూలంగా నిర్ణయాలు చేశారని తెలిపారు. రాష్ట్రంలో షెడ్యూల్ పరిశ్రమల్లో కనీస వేతనాల ఉత్తర్వులను సర్కార్ తాత్సారం చేస్తున్నదని, ఆయా జీవోల వల్ల సర్కార్‌పై పైసా భారం పడకపోయినా రాజకీయ కారణాల రీత్యా తొక్కిపట్టడం సరైందికాదన్నారు. ప్రపంచంలోని 129దేశాల్లో సమ్మెలపై నిషేధాలు ఉన్నాయని, అయినా కార్మికులు తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నారని గుర్తుచేశారు. ఎర్రజెండా ఎల్లలు దాటిందని గుర్తు చేశారు. పబ్లిక్ సెక్టార్ కంపెనీలను ప్రయివేటు పరం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం వాటి భూములను సైతం అమ్మడానికి చర్యలు ప్రారంభిం చిందని తెలిపారు. విద్యుత్ సవరణ బిల్లు, జాతీయ విద్యావిధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరముందని చెప్పారు. మనువాద భావజాలానికి వ్యతిరేకంగా మే డే వారోత్సవాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్మికులు, నవతెలంగాణ ఉద్యో గులు కృషి ఆ రకంగా చేయాలని పిలుపునిచ్చారు. ఏఐఐఈఏ మాజీ ప్రధాన కార్యదర్శి కె.వేణుగోపాల్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తున్నారని అన్నారు. కులాలు, మతాల కతీతంగా కార్మికులు తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. నవతెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్(సీజీఎం) పి.ప్రభాకర్ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో సంస్థను నిలబెట్టేందుకు ఉద్యోగులు ఎంతో కష్టపడి పనిచేశారని అన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ కూడా శాయశక్తుల కృషి చేస్తున్నదని తెలిపారు. మే డే స్పూర్తితో సంస్థ అభివృద్దికి మరింత అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ఎడిటర్ కె.ఆనందాచారి మాట్లాడుతూ ప్రపంచంలో ప్రజలు ఒక్క శ్రమ ఆధారంగానే ఐక్యమవుతారని వివరించారు. అందులో భాగంగానే 'ప్రపంచ కార్మికులా.. ఏకం కండి' అంటూ మార్క్స్ పిలుపునిచ్చారని గుర్తుచేశారు. 'హిందువులు - బంధువులు' అని బీజేపీ నేతలు గొప్పగా చెబుతున్నారని, సంపదను సృష్టిస్తున్న కార్మికులు, సంపదను అనుభవిస్తున్న పెట్టుబడిదారులు బంధువులు ఎలా అవుతారని ప్రశ్నించారు. పెట్టుబడిదారులు, కార్మికుల మధ్య హీన, నీచ, వర్ణబేధాలు ఉన్నాయని తెలిపారు. ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే పన్ను, ఒకే మతం గురించి మాట్లాడుతున్నా కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు ఒకే కులం ఉండాలని ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు. నవతెలంగాణ న్యూస్ ఎడిటర్ రాంపల్లి రమేష్ మాట్లాడుతూ చికాగో నెత్తుటి పోరాటంతోనే 8గంటల పని విధానం వచ్చిందని తెలిపారు. దాని ద్వారానే ప్రపంచంలో కోట్లాది రూపాయల సంపద పొగైందని, అయినా ప్రపంచ జనాభాలో సగం ఆర్ధాకలితో అలమటిస్తున్నారని అన్నారు. ఒక 12గంటల పనివిధానంతో దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోతున్నదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్లు నరేందర్‌రెడ్డి, రఘు తదితరులు పాల్గొన్నారు.