Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్ను ప్రయివేటుకు ఎలా ఇస్తారు?
- సచివాలయానికి రాకుండా అడ్డుకోవడంలో అంతర్యమేంటి?
- ఆర్టీఐ కింద దరఖాస్తు ఇచ్చేందుకు కూడా పోనివ్వరా?
- సచివాలయం లోనికి అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు : టీపీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఔటర్ రింగురోడ్డు (ఓఆర్ఆర్) టెండర్లలో జరిగిన అవినీతి బయటపడుతు న్నదనే భయంతోనే ప్రభుత్వం తనను సచివాలయానికి వెళ్లకుండా అడ్డుకుందని టీపీసీసీ అధ్యక్షులు,ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి విమర్శించారు. లక్ష కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును కేసీఆర్, కేటీఆర్ తెగనమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. మంత్రి కేటీఆర్ జైలుకు పోయేదాకా పోరాడతామని చెప్పారు. అంబేద్కర్ సిద్ధాంతాలపై పెద్ద ఎత్తున్న ఉపన్యాసమిచ్చిన కేసీఆర్...24గంటలు తిరగకముందే వాటిని మరిచారని ఎద్దేవా చేశారు.సోమవారం రేవంత్ జూబ్లీహీల్స్ నుంచి నూతన సచివాలయానికి పోతున్న క్రమంలో సెక్రటేరియట్ లోపలికి అనుమతి లేదంటూ లక్డికాపూల్‌లోని టెలిఫోన్ భవన్ వద్ద ఆయన్ను పోలీసులు ఆపారు. ఈ సందర్భంగా పోలీసులకు, రేవంత్‌కు వాగ్వాదం చొటుచేసుకుంది. నేనొక ఎంపీని నన్ను కూడా అడ్డుకుంటారా? అని ఆయన పోలీసులను ప్రశ్పించారు. గత 20 ఏండ్లలో ఎప్పుడూ ఎమ్మెల్యేలు, ఎంపీలను సచివాలయానికి రాకుండా అడ్డుకోలేదనీ, కేసీఆర్ పాలనలో ఒక ఎంపీగా ఉన్న తనను సచివాలయానికి రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు. అధికారులను కలిసి సమాచార హక్కు కింద దరఖాస్తు చేయడానికి వెళ్తున్నానంటూ చెప్పినా పోలీసులు వినలేదన్నారు. ఒక ఎంపీ ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. తన కార్డే గుర్తింపు తనకు అనుమతి అని చెప్పారు. తనను రోడ్డుపై పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓఆర్ఆర్ ను నిర్మించిందన్నారు. ఇందుకోసం రూ.6,696 కోట్లను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలిపారు. ఖర్చు చేసిన డబ్బులను తిరిగి రాబట్టుకోవడానికి టోల్ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందనీ, అందుకే హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసి టోల్ వసూలుకు చర్యలు చేపట్టిందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మొత్తం టెండర్ల పై విచారణ చేయిస్తామనీ, ఇందులో ఎవరినీ వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
రోడ్డుపై రేవంత్ బైఠాయింపు
తాను దరఖాస్తు ఇచ్చి తర్వాతే తిరిగి వెళతానని రేవంత్ భీష్మించుకు కూర్చున్నారు. రోడ్డుపై ఆయన భైఠాయించారు. దాదాపు అరగంట హైడ్రామా అనంతరం పోలీసులు మాసబ్ ట్యాంక్ లోని కార్యాలయంలో దరఖాస్తు ఇవ్వాలని ఆయన సూచించారు. తామే దగ్గరుండి మాసబ్ ట్యాంక్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడ సెక్షన్ అధికారికి ఆయన దరఖాస్తును సమర్పించారు.