Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - సిద్దిపేట
కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులు కాల రాస్తున్నదని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కార్మికుల శ్రమ దోపిడీ జరుగుతున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ప్రపంచంలో అతి పెద్ద కులం కార్మికుల కులమని, మనమంతా కార్మిక కులమేనని, అలసి పోకుండా నిరంతరం వెలుగును ఇచ్చేవాడు సూర్యుడని, అలసిపోకుండా ప్రపంచానికి సేవ చేసేవాడు కార్మికుడని తెలిపారు. సోమవారం మేడే సందర్భంగా బీఆర్టీయూ ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంత్రి బీఆర్ఎస్ జెండా ఎగరేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు కులం, మతం లేదని, కార్మికుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం చాలా పని చేస్తున్నదని తెలిపారు. కార్మికులను గుర్తించాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వాలపై ఉన్నదన్నారు. బీజేపీ పాలిత 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులను పట్టించుకోవడం లేదని, ఆ విషయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వాపోయారు. ప్రపంచానికి సూర్యుడు వెలుతురు ఇస్తే., కార్మికుడు తన చెమట చుక్కలతో పని చేసి అందరి జీవితాల్లో వెలుగు నింపుతున్నారని కొనియాడారు. బీడీ, భవన నిర్మాణ కార్మికులకు రూ.6 లక్షల బీమాను బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. కార్మిక లోకం కలసి పనిచేయాలని, కార్మికులను సంఘటితం చేయాలని కోరారు.
కార్యక్రమంలో బీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి మంచే నర్సింలు, మాజీ మున్సిపల్ చైర్మెన్ రాజనర్సు, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యులు పాల సాయిరాం, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు పిండి అరవింద్, నాయకులు ఎల్లు రవీందర్ రెడ్డి, బండారి నర్సింలు, సంజీవులు, శ్రీమతి, లక్ష్మి, శ్రీనివాస్, శోభన్, బాలు, ఐలారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.