Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీకి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జ్యోతి విజ్ఞప్తి
- ఎంబీ భవన్లో ఘనంగా మేడే వేడుకలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రధాని మోడీ మన్ కీ బాత్ పేరుతో ఆయన మనసులో మాట చెప్తారని, కానీ ప్రజల మన్‌కీ బాత్‌ను ఆయన వినాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి జ్యోతి విజ్ఞప్తి చేశారు. భారతదేశానికి ఒలింపిక్ పతకాలు తెచ్చిన రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేస్తున్నారని వాపోయారు. మోడీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనమని విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణపతాకాన్ని జ్యోతి ఆవిష్కరించారు. 'మేడే వర్ధిల్లాలి, ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి, మర్క్సిజం, లెనినిజం వర్ధిల్లాలి'అంటూ నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా నినాదాలు చేశారు. అనంతరం జ్యోతి మాట్లాడుతూ పోరాటానికి సంకేతంగా మేడేను ప్రపంచంలోని కార్మికులంతా జరుపుకుంటారని చెప్పారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పోరాడి సాధించుకున్న హక్కులకు తిలోదకాలిస్తున్నదని అన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్నదని విమర్శించారు. ఎనిమిది గంటల పనివిధానాన్ని మార్చి 12 గంటలత పనివిధానానికి కుట్రలు పన్నుతున్నారని చెప్పారు. తద్వారా మళ్లీ వెట్టిచాకిరి విధానాన్ని అమలు చేస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటుపరం చేస్తున్నదని అన్నారు. భూములు, గనులు, ఓడరేవులు, ఎయిర్‌పోర్టులను అదానీకి కట్టబెడుతున్నదని వివరించారు. ప్రధాని మోడీ మోదానీగా అవతరించారని ఎద్దేవా చేశారు. దేశంలోని ప్రజలంతా అనేక సమస్యలతో సతమతమవుతున్నారని చెప్పారు.
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌తో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయానని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందన్నారు. ఇంకోవైపు అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ల ఆస్తులు శరవేగంగా పెరిగిపోతున్నాయని చెప్పారు. రెజ్లర్లు జంతర్‌మంతర్‌లో ధర్నా చేస్తుంటే మోడీ ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణలు వస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. కానీ మోడీ మన్‌కీ బాత్ పేరుతో ముచ్చటిస్తున్నారని చెప్పారు. అందువల్ల ఆయన ప్రజల మన్ కీ బాత్ వినాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, పోడు భూములు, ఇండ్లస్థలాలు ఇవ్వాలని సూచించారు. మేడే స్ఫూర్తితో సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పారు. ఒకే దేశం, ఒకే భాష పేరుతో రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తున్నదని విమర్శించారు. మతం పేరుతో ప్రజలను విభజించి విద్వేషాలను పెంచుతున్నదని అన్నారు. మోడీ ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో చైతన్యం పెంచి ఉద్యమాలకు సన్నద్ధం చేయాలని కోరారు. సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో సామాన్యుల బతుకులు ఛిద్రమవుతుంటే అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ల ఆస్తులు విపరీతంగా పెరిగిపోతున్నాయని వివరించారు. పేదలపై భారాలు సంపన్నులకు రాయితీలు కల్పిస్తున్నదని విమర్శించారు. ఒక శాతం సంపన్నుల వద్ద జీడీపీలో 40 శాతం సంపద కేంద్రీకృతమై ఉందన్నారు. ప్రజలను ఐక్యం చేసి ఉద్యమించడం ద్వారానే హక్కులను పరిరక్షించుకోగలమని అన్నారు. దేశాన్ని రక్షించుకునేందుకు ఐక్య ఉద్యమాలను నిర్మించాలని కోరారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి సాగర్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్, రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్, ఆర్ శ్రీరాంనాయక్, ఎంవి రమణ, పి ఆశయ్య, బి హైమావతి, ఆర్ వెంకట్రాములు, బి ప్రసాద్‌తోపాటు వివిధ ప్రజాసంఘాల రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.