Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పుడు అక్కడి వారికే నేర్పుతున్నా....
- ఇదంతా జ్ఞానసముపార్జనలో భాగమే... : సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తాను ఎమ్మెల్యేగా ఉన్న తొలినాళ్లలో మహారాష్ట్ర గురించి గొప్పగా చెప్పుకునే వారమనీ, బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి అన్నాహజారే దాకా గొప్ప చైతన్యాన్ని ఈ దేశానికి అందించిన ఆ రాష్ట్రం నుంచి తాను చాలా నేర్చుకున్నానని బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ తెలిపారు. కానీ నేడు మహారాష్ట్రకు తానే అనేక విషయాలు నేర్పుతున్నాననీ, నేర్చుకోవడం - నేర్పడం జ్జాన సముపార్జనలో భాగమని ఆయన అన్నారు. నాడు తల ఎత్తుకుని చూసిన మహారాష్ట్రను ఇప్పుడు విపత్కర పరిస్థితుల్లో చూడాల్సి రావడానికి అక్కడి ప్రభుత్వాలు అనుసరించిన బాద్యతారాహిత్య నిర్లక్ష్యపూరిత ధోరణులే కారణమని కేసీఆర్ విమర్శించారు.
సోమవారం మహారాష్ట్రకు చెందిన పలువురు ముఖ్యనేతలతో కేసీఆర్ హైదరాబాద్లోని తెలంగాణ భవన్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్రంలో పార్టీ నిర్మాణం, బలోపేతంపై చర్చించారు. పార్టీకి అనుబంధంగా పలు కమిటీల నిర్మాణంతో పాటు 288 నియోజకవర్గాల పరిథిలోని గ్రామాలు, రాష్ట్రవ్యాప్తంగా తాలూకాలు జిల్లాల వారీగా బీఆర్ఎస్ శాఖలను ఏర్పాటు చేసి పార్టీని నిర్మాణాత్మకంగా ప్రజల్లోకి తీసుకుపోయే దిశగా కార్యాచరణపై ఆయన చర్చించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ 'మహారాష్ట్ర ప్రజల జీవితాల్లో గుణాత్మాకాభివృద్ధిని తీసుకురావడానికి బీఆర్ఎస్ అహర్నిషలు కృషి చేస్తుంది. తెలంగాణ ప్రగతి మోడల్ వారిని అమితంగా ఆకట్టుకుంటున్నది. బీఆర్ఎస్ నిర్వహించిన ప్రతి సభను విజయవంతం చేస్తూ పార్టీ పిలుపులో భాగస్వాములవుతూ వారు కనబరుస్తున్న ఉత్సాహం గొప్పది. నాడు తెలంగాణ ఉద్యమం మాదిరిగానే నేడు మహారాష్ట్రలో ప్రజా స్పందన స్పష్టంగా కనిపిస్తున్నది. అక్కడ బీఆర్ఎస్ గాలి వీస్తున్నది' అని సీఎం తెలిపారు.
మహారాష్ట్రలో మొదటి దశలో నాలుగు ముఖ్యపట్టణాలైన నాగపూర్, ఔరంగాబాద్, పూణే, ముంబైల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 288 అసెంబ్లీ నియోజకవర్గాల పరిథిలోని స్థానిక నేతలు ప్రతిరోజు గ్రామ గ్రామానికి వెళ్లి గ్రామ శాఖలను ఏర్పాటు చేయడం వంటి పార్టీ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా బీఆర్ఎస్ను ప్రజల్లోకి తీసుకుపోయేందుకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేసినట్టు తెలిపారు.