Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవ తెలంగాణ - ఖమ్మం రూరల్
కార్మికులు వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడి, ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకున్న రోజే మే డే అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలోని తెల్దారుపల్లి, నాయుడుపేట, ఆరెకోడు, కాచిరాజుగూడెం, ఏదులాపురం గ్రామాల్లో సోమవారం మేడే సందర్భంగా సీపీఐ(ఎం), సీఐటీయూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకి తమ్మినేని హాజరై జెండావిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 137 ఏండ్ల చరిత్ర కలిగిన ప్రపంచ కార్మిక దినోత్సవం 'మే' డేనని తెలిపారు. 'ప్రపంచ కార్మికులారా ఏకంకండి' అనే నినాదంతో మేడే వేడుకలు నిర్వహిస్తున్నామని, నేడు రాష్ట్రంలో, దేశంలో వర్గాలకు అతీతంగా కార్మికులు, కర్షకులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. బీజేపీ అధికారం చేపట్టాక 44 లేబర్ కోడ్లను రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం ఒకపక్క కార్పొరేట్ అనుకూల విధానాలు.. మరోపక్క మతోన్మాద చర్యలను రెచ్చగొడుతూ కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతూ వర్గ ఐక్యతను దెబ్బతీస్తుందన్నారు. మనుధర్మం ఆధారంగా ప్రభుత్వ పాలన కొనసాగించాలని ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.
ఈ విధానాల ఫలితంగా రోజురోజుకీ అంతరాలు పెరిగిపోతున్నాయని, ఆకలి, సమస్యలు, అంతరాలు ఉన్నంతకాలం ఎర్ర జెండా ఉంటుందని, దీన్ని ఆపడం ఎవరి తరం కాదని స్పష్టంచేశారు. ఎర్రజెండా నీడన మేడే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో సీపీఐ(ఎం), సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించే పోరాటాలు, ఆందోళనలకు కార్మికులంతా ఐక్యంగా పోరాటాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కమిటీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.