Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మామూలు ధాన్యం ధరే చెల్లిస్తాం .. రైతులు ఆందోళన చెందొద్దు
- ఏటా మార్చి నాటికే కోతలు పూర్తి చేయండిి.. : సీఎం కేసీఆర్ ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అకాలవర్షాలతో తడిసిపోయిన ధాన్యానికి కూడా మామూలు ధర ఇచ్చి ప్రతి గింజా కొంటామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. రైతులు ఈ విషయంలో ఎలాంటి ఆందోళనకు గురికావద్దని భరోసా ఇచ్చారు. వ్యవసాయాన్ని కాపాడుతూ రైతుల కష్టాల్లో భాగస్వామ్యం కావడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. భవిష్యత్‌లో యాసంగి వరి కోతలు మార్చి నెలలోపే జరిగే విధంగా ఎలాంటి విధానాలను అవలంబించాలో అధ్యయనం చేయాలనీ, ఆ దిశగా రైతాంగాన్ని చైతన్యం చేసేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. అకాల వర్షాలు కొనసాగుతున్నందున రైతులు వరికోతలను మరో మూడు నాలుగు రోజులు వాయిదా వేసుకోవడం మంచిదని సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంగళవారంనాడాయన అకాల వర్షాలు, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, జగదీశ్వర్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, బాజిరెడ్డి గోవర్ధన్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకష్ణారావు, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శులు స్మితా సబర్వాల్, రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ వీ అనిల్‌కుమార్ తదితరులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులు, పంటల కొనుగోళ్లు, నష్టాల వివరాలను అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించారు. దీనిపై స్పందించిన ఆయన వడగండ్ల వానలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేలు అందిస్తున్న విషయాన్ని తెలిపారు. రైతుల విషయంలో రాష్ట్ర ఖజానాపై ఎంత భారం పడినా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. యాసంగి వరి ధాన్యం తడుస్తున్న నేపథ్యంలో రైతుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుందనీ, అందుకే తడిసిన వరి ధాన్యాన్ని కూడా సేకరించాలని నిర్ణయించామన్నారు. ధాన్యం సేకరణకు అకాల వర్షాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మూడు, నాలుగు రోజులపాటు వానలు కొనసాగుతాయని అధికారులు ఇచ్చిన వివరాలను ఆయన పరిశీలించారు. వర్షాలు తగ్గేదాకా రైతులు వరిపంటను కోయకుండా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఏటా మార్చి నెలాఖరు నాటికి యాసంగి వరికోతలు పూర్తయ్యేలా రైతాంగం వరిని ముందస్తుగానే నాటుకోవాలనీ, తద్వారా అకాల వర్షాల ముప్పును తప్పించుకోవచ్చని చెప్పారు. ఏప్రిల్, మే నెలలు వచ్చేదాకా వరిపంట నూర్పకుంటే ఎండలు ఎక్కువయ్యి ధాన్యంలో నూకశాతం పెరుగుతుందన్నారు. అయితే దీనిపై శాస్త్రీయ అధ్యయనం చేయాలని ఆయన వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. ఎరువుల వాడకంపై కూడా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో తలెత్తే మార్పులను ఎప్పటికప్పుడు రైతాంగానికి అర్థమయ్యే రీతిలో కరపత్రాలు, పోస్టర్లు, ప్రకటనల రూపంలో ప్రచారం చేయాలని చెప్పారు. రైతు వేదికలను కేంద్రంగా చేసుకొని వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆదేశించారు. అధికారులు పనితీరును మెరుగుపరిచేందుకు ఆకస్మిక తనిఖీలు చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు.