Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గింజలేక వరికోతలకు రైతులు దూరం
అకాల వడగండ్ల వానలు యాసంగి ఎవుసాన్ని చేతికి రాకుండా చేశాయి. పొలంలోని వరిగొలుసుకు ధాన్యం గింజ కూడా మిగలకుండా రాల్చి, కోసిన ధాన్యం కుప్పలను నీటిపాల్జేసి ఊహించని కష్టాన్ని, నష్టాన్ని మిగిల్చాయి. పర్యవసానంగా ఆరుగాలం శ్రమించిన రైతులతో సహా సాగుపై ఆధారపడిన కూలీలు, హమాలీలు, ట్రాక్టర్, హార్వెస్టర్ల నిర్వాహకులు, సాగుయంత్రాల తయారీ, మరమ్మతు పరిశ్రమలు.. ఇలా చెప్పుకుంటూపోతే అనేక మంది 'ఉపాధి' పోయింది. ఈ నేపథ్యంలో నవతెలంగాణ వారి స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. అక్కరకు పడాల్సిన వర్షాలు.. కాలం కాని వేళ పడి వారి కడుపు కొట్టిన పరిస్థితులు కన్నీరు తెప్పిస్తున్నాయి. రాష్ట్రంలో చాలా చోట్ల ఇవే పరిస్థితులు ఉన్నాయి. సాయంత్రం కాగానే వర్షం పడుతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుతున్నారు.
- కొనుగోలు కేంద్రాల్లో పనిలేక హమాలీల అవస్థ
- కొత్తగా సాగు పరికరాలకు ఆర్డర్లు లేవు..
- కుదేలైన సాగుయంత్ర పరికరాల తయారీ, మరమ్మతు కేంద్రాలు
- సాగుపై ఆధారపడిన వారందరినీ ముంచిన వర్షాలు
- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని అన్నదాత వేడుకోలు
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి (శ్రీకాంత్)
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యాసంగి సాధారణ సాగు విస్తీర్ణం 7,39,659 ఎకరాలుకాగా.. 10,21,910 ఎకరాల్లో ఆయా పంటలు సాగయ్యాయి. ఇందులో వరి విస్తీర్ణమే 9,40,067 ఎకరాలు. ప్రారంభంలో నాట్లు వేశాక మెడవిరుపు, ఎర్రబారిన నారుతో మళ్లీ కలియదున్ని కొందరు నాట్లు వేశారు. తీరా 45రోజుల తరువాత పంట చేతికొచ్చే సమయంలో నాలుగు భారీ వర్షాలు గింజ కూడా మిగలకుండా చేశాయి. ఏప్రిల్‌లో కోతలు ప్రారంభమైనా సగం విస్తీర్ణం కోత దశలోనే ఉండిపోయింది. దీంతో కోసిన వరిధాన్యం కుప్పలు తడిసి మొలకెత్తగా.. కోయని పొలాల్లో వరిగొలుసుకు గింజ కూడా మిగలకుండా రాలిపోయాయి. దాదాపుగా రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్న పల్లెటూరు బొంతకుంటపల్లిలో సుమారు 300 ఎకరాల్లో రైతులంతా వరి సాగు చేస్తే.. 250 ఎకరాల్లో వడగండ్లు గింజ కూడా మిగలకుండా రాలిపోయి తడిసి ముద్దయింది. ఇదే పరిస్థితి తెలంగాణ జిల్లాలన్నింటిలోనూ నెలకొంది. యాసంగి సీజన్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చేది. ఇప్పుడు ఒక్కో సెంటర్లో కనీసం వెయ్యి క్వింటాళ్లు కూడా లేదు. ఒక్కో క్వింటాపై తూకం, లోడ్ చేసినందుకు హమాలీకి రూ.40 దొరికేది. ఇప్పుడు మే1 వరకు కరీంనగర్ జిల్లాలో కనీసం 16వేల మెట్రిక్‌టన్నుల ధాన్యం కూడా సేకరించలేదంటే ఒక్కో సెంటర్లో ఇన్ని రోజులుగా ఒక్కో హమాలీకి రూ.500 కూడా గిట్టుబాటు కాలేదు.
50గంటలైనా నడవని హార్వెస్టర్
సాధారణంగా ప్రతి సీజన్లో ఒక్కో హార్వెస్టర్ కనీసంగా 300గంటల వరకు కిరాయికి వెళ్లేది. ఇప్పుడు వరి కోతల్లేక 50గంటలు కూడా పని దొరకడం లేదు. రాష్ట్రంలో వేలాది హార్వెస్టర్లు ఇండ్లకే పరిమితం అయ్యాయి. పెరిగిన డీజిల్, డ్రైవర్ బత్తా, నిర్వహణ ఖర్చులతో గంటకు రూ.1800 వరకు కిరాయి తీసుకున్న హార్వెస్టర్ నిర్వాహకులు ఇప్పుడు ఖాళీగా ఉండలేక రూ.వెయ్యికే వచ్చేందుకు సిద్ధపడినా ధాన్యం రాలిన వరిని కోసేందుకు రైతులు సిద్ధపడటం లేదు. దీంతో అప్పుజేసి కొన్న హార్వెస్టర్‌కు బ్యాంకు కిస్తీ కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్నెళ్లకోసారి కనీసం రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు కిస్తీ కట్టాల్సిన హార్వెస్టర్ నిర్వాహకులు తల పట్టుకుంటున్నారు. మరోవైపు ట్రాక్టర్లను అగ్రికల్చర్ విభాగం కింద రిజిస్ట్రేషన్ చేస్తున్న ప్రభుత్వం హార్వెస్టర్లను మాత్రం కమర్షియల్ వాహనం కింద జమ కడుతోంది. దీంతో నెలవారీగా ట్యాక్స్‌లు భారంగా మారాయని మానకొండూర్ నియోజకవర్గంలోని బెజ్జంకి మండలానికి చెందిన నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
రైతు బాగుంటేనే.. పరిశ్రమలకు పని
వానాకాలం, యాసంగి సీజన్లలో మరమ్మతుల కు వచ్చే ట్రాక్టర్లు, హార్వెస్టర్లతో ఆయా వెల్డింగ్, గ్యారేజ్‌ల కేంద్రాలు నిత్యం కళకళలాడేవి. ఇప్పుడు నెల రోజులుగా పనుల్లేక.. కనీసం మరమ్మతుకు వచ్చేందుకు ఒక్క వాహనమూ లేక నిర్మానుష్యంగా మారాయి. హార్వెస్టర్ మరమ్మతులు చేసే గ్యారేజీలు, ఫ్రంట్బ్లేడ్, ఫ్లవ్, ట్రాక్టర్ ట్రాలీ, కల్టివేటర్, కేజీ వీల్స్, ఇనుప నాగళ్లు, దుంపలు, వాటర్ ట్యాంకర్లు, ఇతర వ్యవసాయ పనిముట్లు తయారీ, మరమ్మతు చేసే చిన్నపాటి పరిశ్రమలు దీవాలతీసే పరిస్థితికి వచ్చాయి. అందులోని వర్కర్లకు జీతాలివ్వలేక ఆయా పరిశ్రమలు, గ్యారేజీల నిర్వహణ ఖర్చులకు యజమానులు అప్పుల్జేసి ఎదురుపెట్టుబడి పెడుతున్నారు.
పగబట్టినట్టే పనిలేకుండా చేసిన వానలు
వర్షాలు పగబట్టినట్టే వచ్చి వ్యవసాయాన్ని నిండా ముంచాయి. మొన్నటి వరకు ఒక్కో సీజన్లో నా హార్వెస్టర్ కనీసం 300గంటలకుపైగా నడిచింది. ఇప్పుడు కనీసం 30గంటలు కూడా వరి కోతలు దొరకలేదు. పెరిగిన డీజిల్ ధరలు, డ్రైవర్ బత్తా, హార్వెస్టర్ నిర్వహణ ఖర్చులతో పోల్చితే తక్కువ కిరాయికి కోతలకు వెళ్లలేం. అలాగని తక్కువ కిరాయితో ఉన్నా కొద్దిపాటి వరికోతలకు వెళ్తే డ్రైవర్ ఖర్చులూ మిగలవు. ఇప్పటికే హార్వెస్టర్‌పై తీసుకున్న రుణానికి బ్యాంకు కిస్తీకి కష్టంగా మారింది.
కొట్టె దామోదర్- శనిగరం
ఏడాదిగా ఎదురు పెట్టుబడే..!
వానాకాలం, యాసంగి సీజన్లలో కనీసం 30 ట్రాక్టర్ ట్రాలీలు తయారు చేసేవాళ్లం. ఇప్పుడు కనీసం ఐదుకు మించి ఆర్డర్లు రావడం లేదు. పంట పండక, చేతిలో డబ్బుల్లేక ట్రాలీల మరమ్మతుకూ రైతులు రావడం లేదు. ఒక్క ట్రాలీ తయారు చేస్తే రూ.5వేల నుంచి రూ.7వేలు మిగులుతుంది. అలాంటిది నెలలో రెండు కూడా ఆర్డర్లు వస్తలేవు. నా గ్యారేజీలో వర్కర్లకు జీతాలు, నిర్వహణ ఖర్చులే నెలకు రూ.1.50లక్షలవుతోంది. ఏడాది కాలంగా వచ్చే నష్టాలతో ఎదురుపెట్టుబడి పెడుతూ వస్తున్నాను.
చిలగాని కనకయ్య, గ్యారేజీ నిర్వాహకుడు