Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లౌకికవాదానికి వామపక్షమే హామీ
- బీజేపీని ఓడించటమే దేశానికి రక్ష : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్
కేరళ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు పినరయి విజయన్ కేరళ అధికార బాధ్యతలు చేపట్టి ఈ నెలాఖరుకు ఏడేండ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాల సమస్యలు, కేరళ అభివృద్ధికి తన ప్రణాళికలు, దేశంలో రాజకీయ పరిస్థితులపై విజయన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు...
వివిధ సమస్యలపై ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు ఏకమవుతున్నారు. సీనియర్ ముఖ్యమంత్రుల్లో ఒకరిగా మీ అభిప్రాయమేంటీ?
ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు కేంద్రం నుంచి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. సమాఖ్య సూత్రాలను పూర్తిగా విస్మరించడం ప్రధాన సమస్యల్లో ఒకటి. కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా అధికారాన్ని కేంద్రీకరించే ధోరణి ప్రదర్శిస్తున్నది. ఫలితంగా ప్రతిపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలు వివక్ష, వేధింపులకు గురవుతున్నాయి. రాష్ట్రాల ప్రత్యేక అంశాల్లో కేంద్రం జోక్యం చేసుకునే ధోరణిని మనం చూడొచ్చు. రాష్ట్రాల హక్కులు, అధికారాలను కేంద్రం లాక్కుంటున్నది. సమాఖ్య నిర్మాణం ప్రాథమికంగా ఉన్న చోట ఇది జరగకూడదు. ఈ వైఖరిపై నిరసనలు వెల్లువెత్తుతున్నా, కేంద్రం ఇవేమీ పట్టించుకోవడంలేదు. ఆ తరువాత కేంద్రం మరోరకంగా జోక్యం చేసుకుంటున్నది. ఇందుకోసం కేంద్ర ఏజెన్సీలను వినియోగిస్తు న్నారు. మేము ప్రతిపక్షంలో ఉన్నందున ఈ చర్యలు ప్రయోగిస్తున్నారు. అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు ఆమోదం లభించని సందర్భాలు అనేకం ఉన్నాయి. గవర్నర్లు కేంద్రం ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు.
బిల్లులకు గవర్నర్లు ఆమోదం తెలపకపోవడంపై తెలంగాణ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది. కేరళ పరిస్థితి ఏమిటీ?
కేరళలో గవర్నర్ తన వైఖరి మార్చుకోవాలి. గవర్నర్ ఆ పని చేస్తారని ఆశిస్తున్నాం. అందుకే మేము ప్రస్తుతం అలాంటి మార్గాన్ని తీసుకోలేదు. అయినా ఎలాంటి మార్పు కనిపించడం లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏమి చేయాలో ఆలోచిస్తాం.
కేరళపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. గతంలో ప్రధాని మోడీ కేరళను సొమాలియాతో పోల్చారు. ఇటీవల రోడ్ షో కూడా నిర్వహించారు. బీజేపీకి మంచి అవకాశం ఉందని భావిస్తున్నారా?
కేరళలో అధికార పార్టీగా ఎదగడానికి బీజేపీ కొన్ని వ్యూహాత్మక మార్గాలను అనుసరిస్తున్నది. కానీ, కేరళకు తనదైన ప్రత్యేకత ఉంది. అందుకే మలయాళీలు బీజేపీ సిద్ధాంతాన్ని స్వాగతించరు. ఈ విషయాన్ని బీజేపీ కూడా అర్థం చేసుకుంది. వారు ఇప్పటికే చాలా ప్రయత్నించారు. కానీ కేరళలో ప్రవేశించలేకపోయారు. కనుక ఇప్పుడు తమ ప్రయత్నాలను మైనార్టీ వర్గంపై కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే మనమందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆర్ఎస్ఎస్ నాయకత్వం కనుసన్నల్లో బీజేపీ పని చేస్తున్నది. ఆర్ఎస్ఎస్ విధానాలనే బీజేపీ అమలు చేస్తున్నది. అనేక రాష్ట్రాల్లో మైనార్టీలు దాడులను ఎదుర్కొంటున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ దాడులు పెరిగాయి. అక్కడ మైనార్టీలను ఎలా చూస్తారో అందరికీ తెలిసిందే. అది ఆర్ఎస్ఎస్ భావాజాలాన్ని అమలు చేయడంలో భాగం. దీన్ని కేరళ వ్యతిరేకిస్తుంది. కేరళలో ఏ మైనార్టీ వర్గం కూడా అభద్రతగా భావించడం లేదు.
సీపీఐ(ఎం) నేతృత్వంలోని వామపక్షాలు దీన్ని ఎలా ఎదుర్కోవాలి? కేరళలో బీజేపీ దాడిని ఎదుర్కొనేందుకు ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నారు?
ప్రత్యేక ప్రణాళిక అవసరం లేదు. ఎందుకంటే మేము చాలా కాలంగా అనుసరిస్తున్న విధానం ఉంది. ఆ విధానం, వైఖరి కారణంగానే కేరళ వేరుగా నిలుస్తోంది. కేరళలో వామపక్షాల బలం అదే. అదే కేరళలో లౌకికవాదానానికి అతిపెద్ద హామీ. వామపక్షాలను బలహీనపరిచేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. ఇంతకు ముందు కూడా చేశారు. కానీ అది అంత సులభం కాదు. సెక్యులరిజాన్ని కాపాడతామని ప్రజలకు తెలుసు. ప్రజలు ఎలాంటి మతతత్వ ఎజెండాలోకి వెళ్లరు.
కేరళలో కాంగ్రెస్కు బీజేపీతో పోరాడే సత్తా ఉందని భావిస్తున్నారా?
కేరళలో బీజేపీతో కాంగ్రెస్ కలిసి ఉంది. ఎల్డీఎఫ్ను ఎదుర్కోవడానికి బీజేపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటున్నదని కేరళను గమనిస్తున్న వారికి తెలుస్తుంది. జాతీయ పరిస్థితులతో పోల్చినప్పుడు కేరళలో కాంగ్రెస్, యూడీఎఫ్లు బీజేపీతో కలిసి పని చేస్తున్నాయి. ఇది నిజానికి కాంగ్రెస్ జాతీయ వైఖరికి విరుద్ధం. కేరళలోని లౌకిక భావాజాలం గల ప్రజలు బీజేపీని కాంగ్రెస్ ఎదుర్కోగలదని భావించడం లేదు.
లోక్సభ ఎన్నికలకు ఏడాది సమయం ఉంది. ప్రతిపక్షాల ఐక్యతపై మీరేమంటారు?
జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యత అంటే ఏమిటీ? జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యత అనేది ఉమ్మడి అభ్యర్థిని కలిగి ఉండటమే కాదు. బీజేపీని ఓడించేందుకు ఏకం కావడమే. బీజేపీని ఓడించేందుకు రాష్ట్ర స్థాయిల్లో వ్యూహం రచించాలని సీపీఐ(ఎం) భావిస్తున్నది. ఇందుకు భావసారూప్యత గల పార్టీలు సహకరించాలి. కేరళ విషయానికి వస్తే బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశం లేదు. కాబట్టి కేరళలో ఉమ్మడి అభ్యర్థి అనే ప్రశ్నే తలెత్తదు.
మిగిలిన మీ మూడేళ్లలో మీ ఎజెండాలో ఏముంది?
రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఈ మూడేండ్లు మాత్రమే కాదు, రాబోయే పదేండ్లు, 25 ఏండ్లకు ప్రణాళికలు రూపొందించుకోవాలి. అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా కేరళను ఎలా తీర్చిదిద్దగలం? ఇందుకోసం అన్ని మూలలను తాకే అభివృద్ధి కావాలి. అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలి. వీటితో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కూడా కావాలి.
లవ్ జిహాద్ సిద్ధాంతం గురించి చెప్పే వివాదాస్పద కేరళ స్టోరీ చిత్రంపై ఏం చర్యలు ఆలోచిస్తున్నారు?
ఈ చిత్రానికి వాస్తవాలతో సంబంధం లేదు. ఇది పూర్తిగా చెత్త చిత్రం. లవ్ జిహాద్ అంశాన్ని సుప్రీంకోర్టు స్వయంగా పరిశీలించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సిద్ధాంతాన్ని కొట్టిపారేసింది. లవ్ జిహాద్ లేదని స్వయంగా కేంద్ర మంత్రి పార్లమెంట్లో చెప్పారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించటమే లక్ష్యంగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. సమాజాన్ని వర్గీకరించడమే దీని లక్ష్యం. ఫిర్యాదులు లేకపోయినా విద్వేషపూరిత ప్రసంగాలపై కేసులు నమోదు చేయాలని సుప్రీం కోర్టు అన్ని రాష్ట్రాలకు ఆదేశించింది. ఈ ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని మేం చట్టబద్ధంగా ఏం చేయాలో అన్వేషిస్తాం.