Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిపోషణ ద్వారా చెంచు చిన్నారులకు పకడ్బందీగా పౌష్టికాహారాన్ని అందించాలని గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లోని బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. చెంచు చిన్నారుల్లో ఎదుగుదల లోపాన్ని అధిగమించేందుకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని సమర్ధవంతంగా అందించాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో బాల్య వివాహాలు పూర్తిగా తగ్గాయనీ, మారు మూల ప్రాంతాల్లో అధికారులతో మరింత అవగాహన చర్యలు చేపట్టాలన్నారు. దీనికి కళ్యాణ లక్ష్మి పథకమే కారణమన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల హాజరు వందశాతం ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు సైతం అంగన్వాడీ కేంద్రానికి వచ్చి పౌష్టికాహారం తినివెళ్ళేవిధంగా వారికి అవగాహన కల్పించాలని సూచించారు. వయసుకు తగ్గ ఎత్తు బరువు లేని పిల్లల విషయంలో బరువులు, ఎత్తులు సరిగ్గా ఉండేలా చూసి, బరువు తక్కువ ఉన్న పిల్లలకు మరింత పట్టిష్టమైన పౌష్టికాహారాన్ని అందించే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పరిశుభ్రత పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్,గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు,మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి భారతి హోళికేరి పాల్గొన్నారు.