Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీఓఏలంతా జయప్రదం చేయాలి : ఎస్వీ.రమ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఐకేపీ వీఓఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలనీ, తదితర సమస్యల్ని పరిష్కరించాలనీ డిమాండ్ చేస్తూ బుధవారం కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, వంటావార్పు నిర్వహిస్తున్నట్టు తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం(సీఐటీయూ అనుబంధం) గౌరవాధ్యక్షులు ఎస్వీ.రమ తెలిపారు. ఆ కార్యక్రమాల్లో వీఓఏలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. సమ్మె చేస్తున్నా సర్కారుకు పట్టదా? అని ప్రశ్నించారు. సెర్ప్ సీఈఓ సందీప్‌కుమార్ సుల్తానియా జోక్యం చేసుకుని వీఓఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. వీఓఏలు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వ అనుకూల సంఘాలు అసత్య ప్రచారాలు చేయడాన్ని ఖండించారు. 18 వేల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఆ సంఘాలకు పట్టవా అని ప్రశ్నించారు. రూ.3,900 వేతనంతో ఎలా బతకాలో చెప్పాలని నిలదీశారు. వీఏఓల మేలు కోసం తాము చేస్తున్న పోరాటంలో కలిసిరావాలని కోరారు.