Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులకు సీఎం కేసీఆర్ ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో రైతు బీమా అమలు చేస్తున్న తీరులోనే కల్లుగీత కార్మికుల కోసం 'గీత కార్మికుల బీమా'ను అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తద్వారా కల్లుగీస్తూ ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిన గీత కార్మికుని కుటుంబానికి రూ. 5లక్షల బీమా సాయాన్ని నేరుగా వారి ఖాతాలో జమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపాందించాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గీత కార్మికులపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కల్లుగీత కార్మికులు ప్రమాదవశాత్తూ జారిపడి ప్రాణాలు కోల్పోతున్న దురదష్ట సంఘటనలు జరుగుతుంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి ఉహించని దురదృష్టకర సందర్భాల్లో మరణించిన కల్లుగీత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. ఇప్పటికే ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నా బాధితులకు అందడంలో ఆలస్యమవుతున్నదనీ, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతన్నల కుటుంబాల కోసం అమలు చేస్తున్న రైతుబీమా తరహాలో కల్లుగీతను వృత్తిగా కొనసాగిస్తున్న, గౌడన్నల కుటుంబాలకు వారం రోజుల్లోనే బీమా నగదు అందేలా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని మంత్రులకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశాలు జారీ చేశారు.