Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 3,897 మంది సర్వీసుల క్రమబద్ధీకరణ :విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల దశాబ్ధాల కల సాకారమైంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యా శాఖలోని 3,897 మంది కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం కమబద్ధీకరించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ మంగళవారం జీవో నెంబర్లు 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 ఉత్తర్వులను విడుదల చేశారు. గత నెల 30న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల క్రమబద్ధీకరణ దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 5,544 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వులు విడుదల చేశారు. తాజాగా సంబంధిత శాఖల వారీగా జీవోలు విడుదల చేయడం గమనార్హం. 2016, ఫిబ్రవరి 26 నాటికి ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో సర్వీసులో ఉన్న జనరల్, ఒకేషనల్ విభాగంలోని కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరిస్తున్నామని వివరించారు.
సీఎంకు కాంట్రాక్టు అధ్యాపకుల కృతజ్ఞతలు
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ ఉత్తర్వులను జారీ చేయడం పట్ల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మంగళవారం హైదరాబాద్‌లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్య క్రమంలో మంత్రులు టి హరీశ్‌రావు, వి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాంట్రాక్టు అధ్యాపకుల సంఘాల నాయకులు జి రమణారెడ్డి, కొప్పిశెట్టి సురేశ్, వస్కుల శ్రీనివాస్, కనకచంద్రం, గాదె వెంకన్న, శోభన్‌బాబు, కడారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.