Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇతర పార్కుల అప్‌గ్రేడ్, సకల సౌకర్యాల కల్పన : అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
- జూపార్కులో ఎంట్రీ ఫీజు పెంపునకు జపాట్ ఆమోదం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్కును తీర్చిదిద్దుతామనీ, ఇతర పార్కులను అప్‌గ్రేడ్ చేసి సకల సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని అరణ్యభవన్‌లో జపాట్ (జూస్ అండ్ పార్క్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ) పాలకమండలి సమావేశం నిర్వహించారు. కాకతీయ జూ పార్క్(హన్మకొండ), పిల్లలమర్రి మినీ జూపార్క్(మహబూబ్ నగర్), లోయర్ మానేరు డీర్ పార్క్(కరీంనగర్), కిన్నెరసాని డీర్ పార్క్(పాల్వంచ)లలో జంతు సంరక్షణ- ప్రదర్శన చర్యలు, కేబీఆర్, మృగవని, మహవీర్ హరిణ వనన్థలి, ఇతర అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో సౌకర్యాల కల్పనపై ప్రధానంగా సమావేశంలో చర్చించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నెహ్రూ జూ పార్క్‌లో సౌకర్యాలను మెరుగు పరచాలనీ, వన్య ప్రాణుల ఆవాసాలను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇంకా ఆకర్షణీయమైన జంతువులను దిగుమతి చేసుకోవటం, పులి, సింహం ఎన్ క్లోజర్లను గ్లాస్ పార్టీషన్ తో అతిదగ్గరి నుంచి చూసే ఏర్పాటు, సందర్శకులకు మరిన్ని సౌకర్యాలు, పర్యావరణ విజ్ఞాన కేంద్రం ఏర్పాటుపై చర్చించారు. నెహ్రూ జూ పార్క్ లో ప్రస్తుతమున్న సౌకర్యాలు, అభివృద్ధికి అవకాశాలున్న అంశాలపై క్యూరేటర్ ప్రశాంత్ పాటిల్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. మీరాలం ట్యాంక్ నుంచి జూ పార్క్ లోకి వచ్చే నీటిని నియంత్రించటం, మిషన్ భగీరథ ద్వారా జంతువులకు తాగునీటి వసతిని సంబంధిత శాఖ అధికారులతో చర్చించాలని నిర్ణయించారు. పెరిగిన యాజమాన్య ఖర్చులను దష్టిలో పెట్టుకుని నెహ్రూ జూ పార్క్ ఎంట్రీ ఛార్జీలను నామమాత్రంగా పెంచేందుకు పాలక మండలిలో నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పెద్దలకు రూ.70, పిల్లలకు రూ.45 ఎంట్రీ ఫీజు తీసుకోవాలనీ, సెలవు రోజుల్లో పెద్దలకు రూ.80, పిల్లలకు రూ.55 తీసుకోవాలని తీర్మానించారు. జంతువులను దత్తత తీసుకుని, నిర్వహణ వ్యయాన్ని విరాళంగా ఇచ్చే సదుపాయాన్ని మరింతగా విస్తరించాలని నిర్ణయించారు. నిపుణుల సూచనలతో వీలైనంత త్వరగా అమలుకు చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం.డోబ్రియాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతితో హైదరాబాద్‌తో పాటు అన్ని జూ పార్క్‌లు, నేషనల్ పార్క్‌లను, అర్బన్ ఫారెస్ట్ పార్క్ లను పర్యావరణహితంగా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. సమావేశంలో జూ పార్క్ డైరెక్టర్ వినరు కుమార్, ఓఎస్డీ శంకరణ్, జపాట్ పాలకమండలి సభ్యులు, వివిధ జూ పార్క్‌లు, జాతీయ పార్కుల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.