Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమ్మె వాయిదా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉపకారవేతనం పెంపు డిమాండ్‌తో బుధవారం నుంచి సమ్మెకు వెళతామని ఇదివరకే ప్రకటించిన తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజూడా) తాజాగా వాయిదా వేసింది. మంగళవారం హైదరాబాద్‌లో వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావుతో టీజూడా నాయకులు చర్చించారు. ఇంటర్నీలు, పీజీలు, సూపర్ స్పెషాలిటీ రెసిడెంట్స్‌కు 15 శాతం ఉపకారవేతనం పెంపు పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని హరీశ్ రావు తెలిపారు. ప్రస్తుతం సీఎం ఆమోదం కోసం ఉందని చెప్పారు. 2021 మే నెలలో ఉపకారవేతనం పెంపుదల జరిగిందనీ, ఈసారి కూడా మేలో జరుగుతుందని హామీ ఇచ్చారు. చర్చల అనంతరం సమ్మెను ప్రస్తుతం వాయిదా వేస్తున్నామని టీజూడా అధ్యక్షులు డాక్టర్ కౌశిక్ కుమార్ పింజరాల ఒక ప్రకటన విడుదల చేశారు. మంత్రి హరీశ్‌రావు జూనియర్ డాక్టర్లకు ఎప్పుడూ అండగా ఉంటున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి హామీ, ప్రజా ఆరోగ్య పరిరక్షణను పరిగణనలోకి తీసుకుని సమ్మెను వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. ఉపకారవేతనం పెంపుదలతో పాటు మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన పెండింగ్ ఉపకారవేతనాల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.