Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన
- ఏర్పాట్లు సత్వరం పూర్తి చేయాలి
- నెలాఖరులోగా గాంధీ సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ పూర్తి చేయాలి : మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిమ్స్ ఆస్పత్రి విస్తరణలో భాగంగా నిర్మించబోతున్న రెండు వేల పడకల నూతన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా త్వరలో భూమి పూజ చేసుకోబోతున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. దీనికి సంబంధించి త్వరగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మొత్తం మూడు బ్లాకుల్లో ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ సేవలు అందించే విధంగా ఉండే ఈ నూతన నిర్మాణానికి అవసరమైన అన్ని విభాగాల అనుమతులు పూర్తి చేసుకునీ, నిర్మాణం మొదలు పెట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఉన్నతాధికారులతో తొలి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ ఈ నిర్మాణం పూర్తయితే పడకల సంఖ్య 3,500కు చేరుతుందనీ, నిమ్స్‌లో ఇటీవల ప్రారంభించిన మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ (ఎంసీహెచ్) నిర్మాణం పూర్తయితే 3,700కు చేరుతాయని తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో నిర్మిస్తున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇది ప్రారంభిస్తే దేశంలోనే తొలి సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ తెలంగాణలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. గాంధీలో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రాన్ని, స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ పనులు వేగవంతం చేయాలని సూచించారు. బ్రెయిన్‌డెడ్ డిక్లరేషన్లు జరిపి, అవసరమైన వారికి అవయవాలు అందించి పునర్జన్మ పొందేలా చూడాలన్నారు.
కేంద్రం వ్యాక్సిన్లు సరఫరా చేయకున్నా...
రాష్ట్ర ప్రజల అవసరాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లు సరఫరా చేయకున్నా, రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖాన, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. కొవిడ్ సహా అన్ని రకాల వ్యాక్సినేషన్ కార్యక్రమాల్లో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉండేలా కృషి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
స్టాఫ్ నర్స్ పరీక్ష ఆన్ లైన్ ద్వారా....
వైద్యారోగ్య శాఖలోని వివిధ విభాగాల్లో భర్తీ చేసే 5,204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఆన్లైన్ విధానంలో నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ల తుది ఫలితాలు విడుదల కంటే ముందే, అసిస్టెంట్ ప్రొఫెసర్ల బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.
రెండు వారాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్టాఫ్ నర్స్ పరీక్షల కోసం ఇప్పటి వరకు 40,936 మంది దరఖాస్తు చేసుకోగా, హైదరాబాద్‌తో పాటు, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు అధికారులు మంత్రికి తెలిపారు.
ప్రతి రోజు రెండు గంటలు రౌండ్స్....
ఆస్పత్రుల డైరెక్టర్లు, సూపరింటెండెంట్లు ప్రతి రోజు రెండు గంటల పాటు ఆయా ఆస్పత్రుల్లో రౌండ్స్ వేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఇలా రౌండ్స్ వేసి అన్ని విభాగాలు సందర్శిస్తే మెజార్టీ సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్యశ్రీ సీఈవో విశాలాచ్ఛి, డీఎంఈ డాక్టర్ కె.రమేష్ రెడ్డి, డీహెచ్ డాక్టర్ జి.శ్రీనివాస రావు, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజరు కుమార్, సీఎం ఓఎస్డీ గంగాధర్, నిమ్స్ ఇన్చార్జి డైరెక్టర్ బీరప్ప, గాంధీ సూపరింటెండెంట్ రాజారావు తదితరులు పాల్గొన్నారు.