Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మళ్లీ బీజేపీకి అధికారమిస్తే 50 శాతం కమీషన్
- మోడీ, అమిత్‌షాకు దిమ్మతిరిగే తీర్పునివ్వండి :కర్ణాటక ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వెయ్యి మంది అమిత్షాలొచ్చినా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కదలించలేదరని టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ఈడీ, సీబీఐ వంటి సంస్థలను దుర్వినియోగం చేసి ఆనాడు ఖర్గే లక్ష్యంగా కుట్ర చేసి ఓడించారనీ, ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చిందని కర్ణాటక ప్రజలకు గుర్తు చేశారు. మోడీ, అమిత్‌షాకు దిమ్మతిరిగే తీర్పును ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే కాంట్రాక్టుల్లో కమీషన్ 40శాతం నుంచి 50 శాతానికి చేరుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బీదర్, బాల్కీ, బసవ కళ్యాణ్, హుమాబాద్ ప్రాంతాల్లో జరిగిన నాలుగు ఎన్నికల ప్రచార సభల్లో రేవంత్ ప్రసంగించారు. ఖర్గే లాంటి ఒక యోధుడిని ఓడించేందుకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఇంచార్జిగా నియమించి కుట్రను చేస్తున్నదని విమర్శించారు. బీజేపీ కుట్రల కారణంగా ఓడిపోయిన ఖర్గే చేతిని కాంగ్రెస్ వదల్లేదన్నారు. రాజ్యసభ సభ్యున్ని చేసిందనీ, ఏఐసీసీ అధ్యక్షున్ని చేసిందని గుర్తు చేశారు. ఖర్గే నేతృత్వంలో 150 సీట్లతో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. సోనియా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకు రావాలని పిలుపునిచ్చారు. గుజరాత్ ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు మోడీ, అమిత్ షా ఇవి గుజరాత్ ఆత్మ గౌరవానికి సంబంధించిన ఎన్నికలని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.