Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ ఆ రాష్ట్రానికి మాత్రమే ప్రధానా?
- బీజేపీ ఉచిత పథకాల మ్యానిఫెస్టోపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం
- సిరిసిల్ల నియోజకర్గంలో క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన
- వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు భరోసా
నవతెలంగాణ - సిరిసిల్ల/ ఎల్లారెడ్డిపేట
''ఉచిత పథకాలపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలు.. కర్నాటక రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఓట్ల కోసం పాలు, పెరుగు, గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని హామీలివ్వడం విడ్డూరంగా ఉంది.. ఉచిత సిలిండర్లు తెలంగాణలో ఇవ్వరా.. మోడీ కర్నాటకకు మాత్రమే ప్రధానా?..'' అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. మంగళవారం సిరిసిల్ల నియోజకవర్గంలో పలు మండలాల్లో పర్యటించిన మంత్రి కేటీఆర్.. క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతులతో మాట్లాడి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో సమావేశంలో మంత్రి మాట్లాడారు. అకాల వర్షాలకు నష్టపోయిన అన్నదాతల కష్టాలు, పరిస్థితులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎంతో కలచివేశాయని, ఐదు జిల్లాల్లో పరిస్థితులను సీఎం స్వయంగా పరిశీలించారని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 33నుంచి 50శాతం వరకు వడగండ్ల వానకు ధాన్యం చేనుల్లోనే రాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. 19వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు అధికారుల నివేదికలు తెలుపుతున్నాయన్నారు. తడిసిన ధాన్యం, మొలకెత్తిన ధాన్యం కొనుగోలు విషయంలో ఇప్పటికే మంత్రి గంగుల కమలాకర్‌తో చర్చించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు భరోసాగా నిలుస్తూ ఎకరాకు రూ.10వేల పరిహారాన్ని అందిస్తుందని స్పష్టం చేశారు.
కర్నాటక రాష్ట్ర ఎన్నికలపై స్పందించిన మంత్రి కేటీఆర్.. మొన్నటివరకు ఉచిత పథకాలు మంచివి కాదన్న మోడీ,, ఓట్ల కోసం కర్నాటక రాష్ట్రంలో ఏడాదికి మూడు సిలిండర్లు ఫ్రీ, పాలు ఫ్రీ అనడం విడ్డూరంగా ఉందన్నారు. మోడీ కర్నాటక రాష్ట్రానికి మాత్రమే ప్రధానా..? దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎందుకుని ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వరు? తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఫ్రీ సిలిండర్లు ఇవ్వరు? అని ప్రశ్నించారు. మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలు లేవని పట్టించుకోవడం లేదా అని ప్రశ్నించారు. రూ.400 ఉన్న సిలిండర్‌ను రూ.1200కు పెంచిన మోడీ సర్కారు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తే నష్టపరిహారం అయిపోదన్నారు. అదానీ కొనే ఎయిర్‌పోర్టుపై జీఎస్టీ వేయకుండా సామాన్యుడు వాడే మందులు, పాలు, పెరుగు, ఇతర నిత్యావసరాలపై జీఎస్టీ వేసిన ఖరీదైన ప్రధాని మోడీకి రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఈ సమావేశంలో టెస్కాబ్ చైర్మెన్ కొండూరి రవీందర్రావు, పవర్లూమ్ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ జిదం కళ, భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి పాల్గొన్నారు.
కాంగ్రెస్ నాయకుల నిరసన
మంత్రి కేటీఆర్ వెళ్లే దారిలో.. ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలతో నిరసన తెలపగా.. పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి సమస్యను వినకపోవడం సరికాదని కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన ప్రతి ఎకరాకూ రూ.25వేల చొప్పున నష్టపరిహరం ఇవ్వాలని నినాదాలు చేశారు.