Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరుగుతున్న పేదరికం, నిరుద్యోగం : సీపీఐ జాతీయ కార్యదర్శి డా కె.నారాయణ
నవతెలంగాణ-బంజారాహిల్స్
ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం సామాన్యుల రక్తాన్ని పీల్చే జలగలాంటిదని, మోయలేని పన్నుల భారాలతో ప్రజలు విలవిల్లాడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డా. కె.నారాయణ అన్నారు. ప్రధాని మోడీ పాలనలో దేశంలో పేదరికం, నిరుద్యోగం, అసమానతలు గణనీయంగా పెరిగిపోయాయని తెలిపారు. ''బీజేపీ హటావ్-దేశ్ బచావ్'' నినాదంతో హైదరాబాద్లోని పంజాగుట్ట, నాగార్జున సర్కిల్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో మంగళవారం ఇంటింటికీ సీపీఐ కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈ.టి.నరసింహ, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్.ఛాయాదేవితో కలిసి పాదయాత్ర చేశారు. కరపత్రాలు పంచుతూ బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి, వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా నారాయణ మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వ హయాంలో పెట్టు బడిదారుల లాభాలు గణనీయంగా పెరిగాయని, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు నిండా మునిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువులు, ఔషధాలు ధరల భారీగా పెరిగి సామాన్య ప్రజలు జీవించలేని స్థితిలోకి నెట్టబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య ద్వేషాలను రెచ్చగొడుతూ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాదాన్ని ధ్వంసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పంజాగుట్టలో పబ్లిక్ - ప్రయివేటు పార్ట్నర్షిప్లో నిర్మించిన శ్మశాన వాటికను బ్యాగారి వృత్తిదారులతో కలిసి పరిశీలించారు. శ్మశాన వాటికల ప్రయివేటీకరణను అడ్డుకుంటామని నారాయణ చెప్పారు.
కాటి కాపరుల వృత్తిని దెబ్బతీస్తే ఊరుకునేది లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి శ్మశాన వాటికల ప్రయివేటీకరణను విరమించుకోవాలని, లేకుంటే సీపీఐ ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమాల్లో సీపీఐ హైదరాబాద్ జిల్లా సహాయ కార్యదర్శులు కమతం యాదగిరి, బి.స్టాలిన్, రాష్ట్ర సమితి సభ్యులు బి.వెంకటేశం, జిల్లా కార్యవర్గ సభ్యులు నిర్లేకంటి శ్రీకాంత్, నాయకులు ఆరుట్ల రాజ్ కుమార్, శక్రి భారు, చెతన్య యాదవ్, బాలకృష్ణ, బి.రాజు గౌడ్, కళ్యాణ్, ఎండి. అహ్మద్, అబ్బాస్ పాల్గొన్నారు.