Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఐ, డ్రైవర్ మృతి
- కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు
- ఇంటెలిజెన్స్ చీఫ్ భద్రతలో ఘటన
నవతెలంగాణ- ఏటూరునాగారం ఐటీడీఏ
ఇంటెలిజెన్స్ చీఫ్ పర్యటన నేపథ్యంలో భద్రతాచర్యల్లో పాల్గొన్న పోలీసు వాహనం బోల్తాపడింది. ములుగు జిల్లా ఏటూరునాగారం పోలీస్‌స్టేషన్‌లో సెకండ్ ఎస్ఐ బండారి ఇంద్రయ్య'(59), ప్రయివేట్ డ్రైవర్ చెట్టుపల్లి రాజు(25) మృతిచెందారు. మరో కానిస్టేబుల్ మెట్టు శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం జీడివాగు వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
వెంకటాపురం(కె) పోలిస్‌స్టేషన్ తనిఖీ కోసం ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావు, ఐజీ రవివర్మ వచ్చారు. అనంతరం భద్రాచలం వైపు వెళ్తుండగా ఏటూరునాగారం సెకండ్ ఎస్ఐ ఇంద్రయ్య ప్రయివేటు డ్రైవర్ రాజు, కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను తీసుకొని ఎస్కార్ట్‌గా వెళ్లారు. ఉన్నతాధికారులు వెళ్తున్న క్రమంలో ఎస్కాట్ ఇస్తుండగా వాహనం అదుపుతప్పి జీడివాగు వద్ద బొల్తాపడి సుమారు 10మార్లు పల్టీలు కొట్టింది. దీంతో ముందు కూర్చున్న ఎస్ఐ ఇంద్రయ్య, డ్రైవర్ రాజు వాహనం నుంచి ఎగిరి రోడ్డుమీద పడ్డారు. తలకు బలమైన గాయాలై ఎస్ఐ ఇంద్రయ్య అక్కడికక్కడే మృతిచెందారు. రాజు చెట్లపొదల్లో పడటంతో కర్రలు, వాహనం ఇనుప చువ్వలు గుచ్చుకొని చనిపోయాడు. చాకచక్యంగా వాహనంలో సీటును పట్టుకొని కానిస్టేబుల్ మెట్టు శ్రీనివాస్ ప్రాణంతో బయటపడ్డారు. అయితే అతని కాలు, వెన్నుముక, తలకు తీవ్ర గాయాలయ్యాయి. శ్రీనివాస్ తేరుకుని మరో ఎస్ఐ రమేష్‌కు సమాచారం అందించగా హుటాహుటిన వెళ్లారు. అప్పటికే ఎస్ఐ, డ్రైవర్ మృతిచెందారు. కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను అంబులెన్స్‌లో ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
1984 బ్యాచ్ కానిస్టేబుల్ ఇంద్రయ్య
హన్మకొండ మండలం పలివెల్పుల గ్రామానికి చెందిన బండారి ఇంద్రయ్య 1984లో తొలి పోస్టింగ్ నల్లబెల్లి స్టేషన్లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం పొందారు. ఆ తర్వాత 2019లో మహబూబాబాద్ టౌన్ ఎస్ఐగా ప్రమోషన్ వచ్చింది. అక్కడ విధులు నిర్వర్తిస్తూ మహబూబాబాద్ కోర్టు లైజనింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తూ 2021 డిసెంబర్లో 317 జీవోలో జరిగిన బదిలీలపై ఏటూరునాగారం సెకండ్ ఎస్ఐగా వచ్చారు. ఇంద్రయ్యకు భార్య ఎలిశా, నలుగురు కుమారులు అవినాష్, అన్వేష్, అకిలేష్, నిఖిలేష్ ఉన్నారు. భార్యతో ఇంద్రయ్య ఇక్కడే ఉంటుండగా, కుమారులు పలివెల్పులలో నివాసం ఉంటున్నారు.
స్నేహితుడితో వచ్చి..
తాడ్వాయి మండలం కాటాపురం గ్రామానికి చెందిన జేసీబీ డ్రెవర్, వ్యవసాయదారుడు అయిన చెట్టుపల్లి రాజు(23) తన స్నేహితుడు వంశీతో కలిసి ఏటూరునాగారానికి వచ్చారు. ఇదే క్రమంలో ఎస్ఐ ఇంద్రయ్యకు డ్రెవర్ అవసరం ఉండగా రాజును తీసుకెళ్లారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో ప్రాణం కోల్పోయాడు. రాజుకు భార్య రాజేశ్వరి, కుమార్తె ఐశ్వర్య, కుమారులు రేవంత్, జున్ను ఉన్నారు.