Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
- ఎంసెట్‌కు 3.20 లక్షల దరఖాస్తులు
- గతేడాది కంటే 53,873 పెరిగిన అప్లికేషన్లు
- 137 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
- ఒకే విడతలో ఈసెట్
- ఒకేరోజు మూడు విడతల్లో లాసెట్, ఎడ్‌సెట్
- ఉన్నత విద్యామండలి చైర్మెన్ లింబాద్రి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎంసెట్‌కు రికార్డుస్థాయిలో 3,20,587 దరఖాస్తులొచ్చాయని ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి చెప్పారు. గతేడాది కంటే ఈసారి 53,873 దరఖాస్తులు పెరిగాయని అన్నారు. ఎంసెట్‌కు గతేడాది 2,66,714 దరఖాస్తులొచ్చాయన్నారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ల స్థానంలో ఈసారి సిట్టింగ్ అబ్జర్వర్లను ప్రతి కేంద్రంలో సెట్ కమిటీ నియమిస్తుందని వివరించారు. వారే పరీక్ష నిర్వహణకు సంబంధించి అన్ని రకాల పనులనూ పర్యవేక్షిస్తారని వివరించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు అందుబాటులో ఉంటుందన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంసెట్‌కు దరఖాస్తు చేసిన వారిలో ఇప్పటి వరకు 2.62 లక్షల మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పారు. తెలంగాణలో 104, ఏపీలో 33 కలిపి మొత్తం 137 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థుల సంఖ్య పెరిగినందున గతేడాది కంటే 28 కేంద్రాలను పెంచామని అన్నారు. ఈనెల 10, 11 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ, 12 నుంచి 14వ తేదీ వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం రాతపరీక్షలను నిర్వహిస్తామని వివరించారు. రోజూ రెండో విడతల్లో పరీక్షలుంటాయని, ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఆరు గంటలకు నిర్వహిస్తామని చెప్పారు. అభ్యర్థులను ఉదయం 7.30 గంటల నుంచి, మధ్యాహ్నం 1.30 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామన్నారు. సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండబోదని స్పష్టం చేశారు. విద్యార్థులు హాల్‌టికెట్‌పై ఉన్న నియమ, నిబంధనలు పాటించాలని కోరారు. విద్యార్థులకు ఇబ్బంది కలిగితే వారి భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని, అందుకే పారదర్శకంగా, పటిష్టంగా ఈ పరీక్షలను నిర్వహిస్తామని చెప్పారు. ఎంసెట్‌పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి సజావుగా జరుపుతామని అన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ప్రత్యేక బస్సులను నడపాలంటూ ఆర్టీసీ అధికారులను కోరామన్నారు. విద్యుత్‌కు అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులను సంప్రదించామని చెప్పారు. ఈనెల 20న ఒకేవిడతలో ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈసెట్ రాతపరీక్షను నిర్వహిస్తామని వివరించారు. ఈనెల 18న ఎడ్‌సెట్, ఈనెల 25న లాసెట్ రాతపరీక్షలను ఒకేరోజు మూడు విడతల్లో నిర్వహిస్తామన్నారు. ఇంటర్లో ప్రవేశాలు పెరగడం, ఇంజినీరింగ్, నర్సింగ్ కోర్సుల్లో చదవాలన్న కోరికతోనే ఎక్కువ మంది అభ్యర్థులు ఎంసెట్‌కు దరఖాస్తు చేశారని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ హైదరాబాద్ వీసీ కట్టా నర్సింహ్మారెడ్డి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, ఎంసెట్ కన్వీనర్ డీన్ కుమార్, కోకన్వీనర్ విజరుకుమార్‌రెడ్డి, పీజీఈసెట్ కన్వీనర్ రవీందర్‌రెడ్డి, ఈసెట్ కన్వీనర్ శ్రీరాంవెంకటేశ్, లాసెట్ కన్వీనర్ విజయలక్ష్మి, ఎడ్‌సెట్ కోకన్వీనర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రవేశపరీక్షల దరఖాస్తుల వివరాలు
సెట్ పరీక్ష తేది దరఖాస్తులు
ఎంసెట్ మే 10,11 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ 3,20,587
మే 12,13,14 తేదీల్లో ఇంజినీరింగ్
ఎడ్‌సెట్ మే 18న 29,390
ఈసెట్ మే 20న 21,586
లాసెట్ మే 25న 41,439
ఐసెట్ మే 26,27 తేదీల్లో 43,242
పీజీఈసెట్ మే 29 నుంచి జూన్ 1 వరకు 13,636