Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం
- సంక్షేమ నిధి ఉపాధ్యాయులకు ప్రయోజనకరం : ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ- నల్లగొండ
నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ 2023- జాతీయ సమైక్యతకు గొడ్డలి పెట్టు అని మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. అఖిలభారత ఉపాధ్యాయ ఉద్యమ జాతీయ నాయకులు, యూటీఎఫ్ పూర్వ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ దాచూరి రామిరెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ ఆడిటోరియంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ ప్రారంభించిన కుటుంబ సంక్షేమనిధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. పూర్వకాలంలో ప్రాచీన భారతదేశంలో అవలంబించిన హిందూ వాదాన్ని ప్రాథమిక విద్య నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చొప్పించాలని కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని తెలిపారు. దేశ చరిత్రను పూర్తిగా వక్రీకరిస్తూ ఇతర మతాల రాజుల చరిత్రను పుస్తకాల నుంచి చెరిపి వేస్తున్నారన్నారు. అందువల్ల రాబోవు తరాలకు వాస్తవాలు తెలియకుండా పోతాయని, ఇది జాతీయ సమైక్యతకు మంచిది కాదని చెప్పారు. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. దాచూరి రామిరెడ్డి ఏడో వర్ధంతి సందర్భంగా టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర శాఖ ప్రారంభిస్తున్న కుటుంబ సంక్షేమనిధి ఉపాధ్యాయులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. రామిరెడ్డి ఎల్లప్పుడూ ఉపాధ్యాయుల సంక్షేమానికి ఒక విధానం ఉండాలని కోరుకునేవారని తెలిపారు. ఆయన మేధస్సు నుంచి పుట్టిన ఆలోచనే ఈ కుటుంబ సంక్షేమ నిధి కార్యక్రమం అన్నారు. దీనిలో సంఘంలోని ప్రతి ఒక్కరూ సభ్యులుగా చేరాలని, వివిధ కారణాల వల్ల మరణించిన సభ్యుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. కుటుంబ సంక్షేమనిధి కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి మాట్లాడుతూ.. కుటుంబ సంక్షేమ నిధి కార్యాలయం నల్లగొండలో ఉన్నా కూడా.. ఇది రాష్ట్ర కుటుంబ సంక్షేమనిధి బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించబడుతుందని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్.రాములు, సిహెచ్.దుర్గ భవాని, కోశాధికారి టీ.లక్ష్మారెడ్డి, ఎస్టీఎఫ్ఐ ఉపాధ్యక్షులు ఎం.సంయుక్త , టీఏపీఆర్పీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.కృష్ణమూర్తి, వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్ ప్రధాన సంపాదకులు బి.మాణిక్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ఎం.రాజశేఖర్‌రెడ్డి, జి.నాగమణి, జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు పాల్గొన్నారు.