Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడవుల్లోకి విస్తరించిన కార్పొరేట్ విషం
- అంతరిస్తున్న ఆదివాసీ కళలు, సంస్కృతి
- అడవుల కాషాయీకరణకు బీజేపీ కుట్రలు
- పరిరక్షణ దిశగా టీఏజీఎస్ ప్రయత్నాలు
- రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసీ కళారూపాలకు ఆహ్వానం
- నేడు, రేపు భద్రాచలంలో 'రేలా పండుగ' ఆదివాసీ సాంస్కృతిక ఉత్సవాలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
''అడవి తల్లికి దండాలో.. మా తల్లి అడవికి దండాలో.. అడవి చల్లగుంటే అన్నానికి కొదవే లేదు..'' అని ఆడుకున్నాం.. ''ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి..'' అని పాడుకున్నాం.. అడవి ప్రాధాన్యతను చాటే ఆ పాటలు, ఆటలన్నీ నేడు అరణ్యరోదనగా మారుతున్నాయి. కార్పొరేట్ విష సంస్కృతి వలలో చిక్కుకున్న అడవులతో పాటే ఆదివాసీల పరిస్థితీ అగమ్యగోచరంగా మారింది. వారి సంస్కృతి, ఉనికి, అస్థిత్వం నేడు ప్రమాదంలోకి నెట్టివేయబడుతున్నాయి. అడవులను, అపురూపమైన ఆదివాసీల సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకునేందుకు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టీబీజీకేఎస్) కంకణం కట్టుకుంది. ఈ నెల 5,6 తేదీల్లో సంఘం రాష్ట్ర మూడో మహాసభల సందర్భంగా బుధ, గురువారాల్లో భద్రాచలంలో 'రేలా పండుగ' జరుగుతోంది. ఆ ఆదివాసీ కళలు, సంస్కృతిని రక్షించుకుందాం రండి.. కుటుంబసమేతంగా హాజరుకండి.. అంటూ ఆహ్వానం పలుకుతోంది.
ఆదివాసీ భాషకు ముప్పు
అడవుల్లో కార్పొరేట్ కంపెనీలు విషం చిమ్ముతున్నాయి. ఆదివాసీ సమాజాలకే ప్రత్యేకమైన సామూహికతత్వాన్ని, ప్రజాస్వామ్య స్వభావాన్ని దెబ్బతీసేలా మోడీ సర్కారు కార్పొరేట్లకు వంతపాడుతోంది. ఆదివాసీల ఏ తెగకు ఆ భాషున్నది. కోయలకు కోయ, గోండులకు గోండు, కొండరెడ్లకు కొండి, గోండులకు గోండు, సవర్లకు సవర భాష ఉన్నది. హిందీని యావత్భారతదేశంపై రుద్దాలనే ప్రయత్నాల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వాలు దానికి దగ్గరగా దేవనాగరి లిపిలో ఉండే సవరభాషకు మాత్రమే లిపిని కల్పించాయనే ఆరోపణలున్నాయి. మిగతా భాషలు తెలుగు- కన్నడ లిపిని ఉపయోగిస్తుండగా ఆదిలాబాద్‌లోని గోండులు మాత్రం దేవనాగరి లిపిని వినియోగిస్తుండటం గమనార్హం. తెలుగు- తెగ భాషలతో రూపొందించిన ఉభయ భాషల వాచకాలను బోధించేందుకు గతంలో అంగన్ ప్రాథమిక పాఠశాలల్లో నియమించిన వాలంటీర్లు నేడు ప్రోత్సాహకాలు లేక కనుమరుగయ్యారని ఆదివాసీలు వాపోతున్నారు. 1985 నుంచి 1996 వరకు నెలకు రూ.1500 వేతనంతో పనిచేసిన ఈ వాలంటీర్లను ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కొంత మేర చర్యలు తీసుకుని.. 1426 స్కూల్స్‌లో గొండి, కోయ, కొలామి, లంబాడీ భాషలతో పాటు నూతనంగా చెంచు భాషను కూడా ప్రవేశపెట్టినట్టు చెబుతున్నారు. వాస్తవంలో అవి ఎక్కడ ఆచరణలో లేవని ఆదివాసీ సంఘాలు అంటున్నాయి.
'హిందూ ఉత్సవ సమితి' రూపంలో ప్రమాదంలో ఆటపాటలు..
కేంద్రంలో బీజేపీ సర్కారు వచ్చినప్పటి నుంచి అడువుల కాషాయీకరణ, కార్పొరేటీకరణ ఊపందు కోవడంతో ఆదివాసీ ఆటపాటలు తమ ప్రత్యేకతను కోల్పోతు న్నాయి. సమిష్టిగా ఆడుకునే థింసా, గుస్సాడి, కోయ, కొమ్ముబూర, రుంజ, రేల నృత్యాల స్థానంలో రణగొణ ధ్వనులు చేసే డీజే సిస్టమ్‌లు అడవుల్లోకి వచ్చాయి. భూమి పండుగ, కొత్తల పండుగ, ఇటుకల పండుగ అనే రకరకాల పండుగలను రూపు మాపి గిరిజన సంస్కృతికి సంబంధం లేని కొత్తకొత్త ఉత్సవాలను 'హిందు ఉత్సవ సమితి' ఆది వాసీల మధ్యకు చేర్చింది. హనుమాన్ జయంతి, వినాయక చవితి వేడుకలను ఆదివాసీలపై రుద్దుతోంది. గృహప్రవేశాల సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతాలను సైతం ఆదివాసీల్లో వ్యాప్తి చేసిందని, ఆదివాసీ పూజారులను కూడా కమర్షియల్‌గా మార్చిందనే ఆరోపణలున్నాయి.
ప్రాజెక్టులతో సంస్కృతి చిన్నాభిన్నం
పోలవరం, కాళేశ్వరం, సీతారామ, సీతమ్మ సాగర్ తదితర ప్రాజెక్టుల నిర్మాణంతో అడవిబిడ్డల బతుకులు, సంస్కృతి చిన్నాభిన్నం అవుతున్నాయని ఆదివాసీ సంఘాలు వాపోతున్నాయి. ఇలాంటి ప్రాజెక్టుల రూపకల్పనలో అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆదివాసీల సంస్కృతి, మనుగడకు ముప్పు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు ఇవేవీ పట్టించుకోకుండా వారిని గాలికొదిలేశాయి. వ్యవ సాయం, వేట, అటవీ ఉత్పత్తుల సేకరణే ప్రధాన ఆధారంగా జీవించే ఆదివాసీల్లో సమిష్టితత్వాన్ని దేశవ్యాప్తంగా ధ్వంసం చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు ఎత్తుతో గోదావరి పరివాహక ఆదివాసీలు చెట్టు కొకరు పుట్టకొకరు కావాల్సి వస్తుండగా.. దుమ్ముగూడెం, చర్ల మండలాలను సీతమ్మ సాగర్ ముంపునకు గురి చేస్తోంది. వీటిపై నిరసనలు వెల్లువెత్తుతున్నా ప్రభుత్వాలు పట్టించుకునే స్థితిలో లేవు.
ఆదివాసీలపై అనేక రకాల దాడులు
విధానాల పరంగా ప్రభుత్వాలు, కార్పొరేట్ శక్తులు ఆదివాసీలపై రకరకాల దాడులు చేస్తున్నాయి. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా కార్పొరేట్ విష సంస్కృతిని ఆదివాసీల్లో చొప్పించే కుట్రలు కొనసాగుతున్నాయి. అటవీహక్కుల చట్టం ప్రకారం ఆదివాసీలకు దక్కాల్సినవేవీ దక్కకపోగా.. ప్రాజెక్టుల నిర్మాణాలతో ఆదివాసీలకు బతుకుదెరువు లేకుండా చేస్తున్నారు. సమ్మేళనాలు తప్ప ఆదివాసీల సంస్కృతి పరిరక్షణకు ఎలాంటి చర్యలు లేవు.
భీమ్రావు, టీఏజీఎస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి