Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బండి లేదా డబ్బులు ఇస్తేనే.. ఇల్లంటున్న ప్రజాప్రతినిధులు
- ఇండ్ల కేటాయింపు సభలో ఆశావహుల ఆరోపణలు
- కొత్తపల్లిలో పేదింటి సొంత కలకు తూట్లు
నవతెలంగాణ - స్టేషన్ ఘన్పూర్
పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్రప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను డబ్బులిచ్చినోళ్లకే ఇస్తున్నరని, రూ.20వేల నుంచి రూ.30 వేల వరకు ఇవ్వాలని, లేదా బండి కొనిస్తే ఇల్లు ఇప్పిస్తామని స్థానిక ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారని ఆశావహులు గ్రామసభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో నిర్మించిన 30 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్దిదారులకు ఇచ్చేందుకు బుధవారం గ్రామసభ నిర్వహించారు. ఈ ఇండ్ల కోసం 210 మంది దరఖాస్తు చేసుకోగా, ఎంపికలో అధికారులు 38మంది లబ్దిదారులను ఎంపిక చేసి, గ్రామసభ నిర్వహించి, డ్రా పద్ధతిలో ఎస్సీలకు 21, బీసీలకు 7, మైనార్టీలకు 2 కేటాయించారు. కాగా గ్రామంలో కొందరు ఆశావాహులు తామూ అర్హులమేనంటూ గ్రామ సభ అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట స్థానిక ప్రజా ప్రతినిధులను అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమకు నిలువ నీడ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఇదివరకూ రెండు సార్లు గ్రామ సభ నిర్వహించి తమ పేర్లను ఖరారు చేసినట్టు చెప్పారని, మూడో గ్రామసభ వచ్చే సరికి తమ పేర్లు జాడ లేకుండా పోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సర్పంచ్, వార్డు సభ్యులు అంతా కలిసి అధికారులతో కుమ్మక్కై కొందరి చేతివాటం కారణంగా తమకు అన్యాయం జరిగిందంటూ ఆగ్రహంతో తిట్ల దండకం ఎత్తుకున్నారు. తాము బండి (ద్వి చక్ర వాహనం) కొనిస్తే.. ఇల్లు ఇప్పిస్తానని చెప్పి తమ పిల్లలతో స్థానిక సర్పంచ్ లక్షల రూపాయలు ఖర్చు చేయించారని గ్రామస్తుడు గండి సమ్మక్క, కొమురయ్య దంపతులు ఆరోపించారు. ఉద్యోగం లేక తమ కుమారుడు అంజనేయులు పొట్ట చేతపట్టుకొని పట్నం వెళ్లి జీవనం సాగిస్తున్నాడని, గతంలో రెండు సభల్లోనూ తమ కొడుకు పేరు ఉన్నా ఇప్పుడు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వారికి మరలా ఇండ్లు ఇచ్చారని ఆరోపించారు. ఇప్పటికైనా అసలైన లబ్దిదారులకు లబ్దిదారులకు ఇండ్లు కేటాయించాలని, లేదంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
గ్రామస్తుల ఆరోపణలపై తహసీల్దార్ పూల్‌సింగ్‌ను వివరణ కోరగా.. తమ దృష్టికి అలాంటివేమీ రాలేదని తెలిపారు. డబల్ ఇండ్ల కేటాయింపు పారదర్శకంగా చేపట్టామని, ఇలాంటివి ఉపేక్షించమని స్పష్టంచేశారు. క్షేత్రస్థాయిలో అర్హులైన వారిని ఎంపిక చేసి ఇచ్చామన్నారు. రెండో దషాగా.. మరి కొంతమంది ఇండ్లు లేని నిరుపేదలకు గ్రామంలో 28 గుంటల ప్రభుత్వ భూమిలో స్థలంతో పాటు, కేసీఆర్ ప్రకటించిన గహలక్ష్మి పథకం కింద రూ. 3లక్షలు అందించే ప్రయత్నం చేస్తామని తెలిపారు.