Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ రాయబారి జాన్తెస్లెఫ్తో సమావేశంలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే స్వీడన్ కంపెనీలకు తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానమని పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే స్వీడన్ కంపెనీలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు. భారత్‌లోని స్వీడన్ రాయబారి జాన్ తెస్లెఫ్ ఆధ్వర్యం లో వచ్చిన ఆ దేశ వ్యాపార, వాణిజ్య ప్రతినిధులు, పలు కంపెనీల అధిపతులతో బుధవారం సచివాల యంలో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్ర పారిశ్రామిక విధానాలు, ప్రభుత్వ ఆలోచన విధానాన్ని వారికి కేటీఆర్ వివరించారు. పెట్టుబడి అవకాశాల గురించి చెప్పారు. ముఖ్యంగా టెక్నాలజీ, తయారీ రంగాల్లో స్వీడన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఈ దిశగా భారతదేశంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్న కంపెనీలను తెలంగాణకు ఆహ్వానించారు. స్వీడన్ రాయబారి ప్రతినిధి బందంలో భాగంగా వచ్చిన ఆ దేశానికి చెందిన కంపెనీల ప్రతినిధులు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాల పట్ల సంతప్తిని వ్యక్తం చేశారు. పారిశ్రామిక అనుకూల ప్రభుత్వ విధానాలను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఎనిమిదేండ్ల కాలంలో హైదరాబాద్ నగరం రూపురేఖలు సంపూర్ణంగా మార్చేలా తీసుకొచ్చిన మౌలిక వసతుల కల్పన అంశాన్ని ప్రస్తావించారు.
హైదరాబాద్ నగరంలో ఉన్న వ్యాపార అనుకూల వాతావరణంతో మరిన్ని పెట్టుబడులను తెలంగాణకు రప్పించేందుకు ప్రయత్నం చేస్తానని మంత్రి కేటీఆర్‌కు స్వీడన్ రాయబారి జాన్ తెస్లెఫ్ హామీ ఇచ్చారు. భారత దేశంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చే కంపెనీల బందంతో కలిసి పనిచేసేందుకు ఇన్వెస్ట్ మెంట్ ఫెసిలిటేషన్ మెకానిజం పేరుతో తాము ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని, ఇది స్వీడన్ వ్యాపార వాణిజ్య సంస్థలతో పాటు పలు కంపెనీలతోనూ కలిసి పని చేస్తుందని వివరించారు. రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలపైనా తమ రాయబార కార్యాలయం నిరంతరం పరిశీలన చేస్తున్నదని, స్వీడన్ కంపెనీలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నామని మంత్రి కేటీఆర్‌కు జాన్ తెస్లెఫ్ తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో వార్డు స్థాయి పాలన
- 150 వార్డుల్లో కార్యాలయాల ఏర్పాటు
- ఈనెలాఖరు నుంచి అమల్లోకి...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో త్వరలో వార్డు స్థాయి పరిపాలన అందించనున్నట్టు పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. దీనికోసం జీహెచ్ఎంసీ పరిధిలోని 150 వార్డుల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసి, పరిపాలనను వికేంద్రీకరిస్తామన్నారు. దీనివల్ల ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు లభిస్తాయని అన్నారు. బుధవారంనాడిక్కడి బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో పురపాలక, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్తగా ఏర్పడే వార్డు కార్యాలయంలో పదిమంది మంది అధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారనీ, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి ఇంచార్జిగా ఉంటారని తెలిపారు. స్థానిక ప్రజలు సర్కిల్, జోనల్ ఆఫీసులకు వెళ్లకుండా వార్డు కార్యాలయంలోనే సేవల్ని పొందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సిటిజన్ ఫ్రెండ్లీగా జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయాలు ఉండాలనీ, ప్రతి వార్డు ఇంకో వార్డు కార్యాలయంతో అనుసంధానం కావాలని సూచించారు. ఈ నెలాఖరునాటికి వార్డు పాలనా వ్యవస్థను సిద్ధం చేయాలనీ, వచ్చే రెండు వారాల్లో వార్డు కార్యాలయాల్లో ఉంచాల్సిన సిబ్బందితో కూడిన బందాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ బృందాలకు వార్డు పాలన వ్యవస్థ ఉద్దేశాలు, లక్ష్యాలు, అది పనిచేసే తీరుకు సంబంధించిన అంశాల్లో పక్కా ప్రణాళికతో శిక్షణ ఇవ్వాలని చెప్పారు. వార్డు కార్యాలయాలన్నీ ఏకరూపంగా ఉండేట్టు చూడాలనీ, సిటిజన్ ఫ్రెండ్లీ డిజైన్‌ను రూపొందించాలని కోరారు. సమావేశంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్తో పాటు పలు విభాగాల పాల్గొన్నారు.