Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముదిరాజ్ ఎంప్లాయీస్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రైతుబంధు తరహాలో మత్స్యకారబంధు అమలు చేయాలని ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మత్స్యరంగ అభివృద్థి కోసం గతంలో ఎన్నడూ లేనంతగా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారి సంక్షేమం కోసం సామూహిక ప్రమాద బీమా పథకం కింద ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం ఉన్నప్పటికీ అమలులో ప్రభావం చూపడం లేదని పేర్కొన్నారు. మత్స్య సహకార సంఘాలలో నమోదు చేసిన సభ్యులందరికీ బీమా పథకం వర్తింపు ప్రకటనలకే పరిమితమైందని తెలిపారు. రైతుబీమా తరహాలోనే ప్రత్యేకంగా మత్స్యకారుల బీమా అమలు చేయాలని కోరారు. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ (జాతీయ మత్స్య అభివృద్థి) బోర్డు, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (జీఏఐఎస్) కింద తీసుకొచ్చిన గ్రూపు బీమాలో మత్స్యకారులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. కేవలం ప్రాథమిక సహకార సంఘంలో సభ్యులై ఉంటే బీమా వర్తిస్తుందంటూ నిబంధనలున్నా అమలు కావడం లేదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి రైతు బంధు తరహాలో మత్స్యకార కుటుంబాలకు వేగవంతంగా బీమా చెల్లించేలా విధి విధానాలను రూపొందించాలని కోరారు. నోడల్ ఏజెన్సీలతో అయ్యేదేమీ లేదని, ప్రభుత్వమే పూనుకుని స్వతహాగా స్థానిక అధికారుల నివేదికలతో మత్స్యకార బీమా బాధిత కుటుంబానికి తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.