Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయాలి : ఎఫ్ఎఫ్జీజీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు ఆస్తిపన్ను బకాయిలు చెల్లించేలా రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు ఇవ్వాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరింది. బుధవారం ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఎఫ్ఎఫ్జీజీ కార్యదర్శి యం.పద్మనా భరెడ్డి లేఖ రాశారు. 'ఏప్రిల్ నెలలో ఇంటిపన్ను చెల్లించిన వారికి పన్నులో ఐదు శాతం రిబేట్ ఇస్తామని జీహెచ్ఎంసీ ప్రకటించింది. ఆ తర్వాత హైదరాబాద్ నగరంలోని సుమారు 8 లక్షల మంది రూ.786.75 కోట్ల ఆస్తిపన్ను చెల్లించారు. వాటితో తమకు కావలసిన పౌరసేవలు ముఖ్యంగా నాలాలు, రోడ్ల మరమ్మత్తు వంటివి చేపడుతారని ఆశించారు. కానీ, వాస్తవంలో ఆ పన్ను డబ్బు ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నేండ్లుగా పన్ను కట్టకపోవడంతో రూ. 5935 కోట్లు(రాష్ట్ర సర్కారు రూ.5560 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ.371 కోట్లు) బకాయి పడ్డాయి. గతంలో సీఎస్‌కు ఇదే అంశంపై లేఖ రాస్తే ఆయా శాఖల అధికారులకు పన్నులు చెల్లించాలని ఆదేశిం చారు. కొన్ని శాఖలే రూ.8 కోట్ల మేర పన్ను కట్టాయి. మిగతావి వసూలు కావాల్సి ఉంది. రాష్ట్ర సర్కారు హైదరాబాద్ నగరపాలక సంస్థపై కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తున్నది. ఎటువంటి కేటాయింపులు లేక నగరపాలక సంస్థను అప్పుల ఊబిలోకి దింపింది. ఇప్పటివరకు చేసిన అప్పులపై రోజుకు రూ.2 కోట్ల వడ్డీ చెల్లింపులు జరుగుతున్నాయని వినిపిస్తున్నది. రాష్ట్ర పన్నుల వసూలులో 80 శాతం నగరపాలక సంస్థ పరిధిలో నుంచే వస్తున్నాయి. అయినా, రాష్ట్ర ప్రభుత్వం నగరపాలక సంస్థకు ఎటువంటి బడ్జెట్ కేటాయింపులు లేవు. నిధుల లేమితో జీహెచ్ఎంసీ ప్రజలకు కావలసిన పౌరసేవలు అందించడం లేదు' అని లేఖలో పేర్కొన్నారు.