Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులపై ప్రేముంటే కేంద్రం నుంచి ఎకరాకు రూ. 10 వేలు తెండి :టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ విమర్శ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా ఆ పార్టీ నేతలందరిదీ అబద్దాల బతుకు అని టీఎస్ఆర్టీసీ చైర్మెన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ విమర్శించారు. ఆపార్టీ నేతలకు రైతుల పై ఏమాత్రం ప్రేమ ఉన్నా పంట నష్టపోయిన రైతులకు కేంద్రం నుంచి ఎకరానికి రూ. 10 వేలు తేవాలని డిమాండ్ చేశారు. బుధవారంనాడాయన బీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. సీఎం కేసీఆర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చారనీ, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొంటామని ప్రకటించారని చెప్పారు. వడగండ్ల వానలో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 10 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారని అన్నారు. వాస్తవాలను ఒప్పుకునే ధైర్యం లేని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు తీవ్ర అసహనాన్ని ప్రదర్శిస్తూ, నోటికొచ్చినట్టు అవాకులు చెవాకులు పేలుతున్నారనీ, ఈ చర్యల్ని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. చేతనైతే రాష్ట్రంలోని రైతుల కోసం కేంద్రం నుంచి ఏ సహాయం తెచ్చారో చెప్పాలని నిలదీశారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతుల కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం రూ. 154 కోట్లను విడుదల చేసిందని గుర్తుచేశారు.