Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆందోళన చెందొద్దు :పౌరసరఫరాల సంస్థ చైర్మెన్ సర్దార్ రవీందర్ సింగ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అకాల వర్షాలతో తడిచిన ధాన్యం విషయంలో అన్ని విధాల ఆదుకుంటామనీ, ఆందోళన చెందొద్దని పౌరసరఫరాల సంస్థ చైర్మెన్ సర్దార్ రవీందర్ సింగ్ రైతాంగాన్ని కోరారు. బుధవారం హైదరాబాద్లోని పౌరసరఫరాల భవన్లో అకాల వర్షాలపై ఆయన సమీక్షించారు. ధాన్యం కొనుగోలు, తరలింపు, తడిసిన ధాన్యం, గన్నీ సంచులు తదితర అంశాలపై చర్చించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైసు మిల్లులకు తరలించాలనీ, మిల్లర్లు వెంటనే అన్లోడింగ్ చేసుకుని వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని అదేశించారు. కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలన్ని కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక లక్ష మంది రైతుల నుంచి రూ.1,710కోట్ల విలువ చేసి 8.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 7 వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అకాల వర్షాల నేపథ్యంలో హైదరాబాదులోని పౌరసరఫరాల భవన్లో టోల్ ఫ్రీ నెంబర్ 1967, 1800 4250 0333 నెంబర్లు ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. వీటికి కాల్ చేసి రైతులు తమ సమస్యలను, ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని సూచించారు.